బాలీవుడ్‌ హీరోయిన్  పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్‌మెంట్‌ కన్నుల పండుగగా జరిగింది. ఢిల్లీ కపుర్తాలా హౌస్‌లో మే 13(శనివారం) సాయంత్రం వేళ వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది  సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బంధుమిత్రుల ఆశీర్వాదాల నడుమ ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలో కొద్ద జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ వేడుకలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రముఖనటి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.






పరిణీతి-రాఘవ ప్రేమను బయటపెట్టిన ఆప్ ఎంపీ


నిజానికి రాఘవ్ చద్దా,   పరిణీతి చోప్రా గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై వారు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.  కానీ, ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎంపీ సంజీవ్ ఆరోరా ధృవీకరించారు. రాఘవ్, పరిణీతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “నేను రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ప్రేమ, ఆనందం, సాంగత్యంతో కలిసి మెలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మరోసారి వారికి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.   


కలిసి చదువుకున్న పరిణీతి, రాఘవ్ చద్దా


ఇక  పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ లో కలిసి చదువుకున్నారు. వారికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరి ద్వారా పరిచయం పెరిగింది. అదికాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కొద్ది కాలం క్రితమే ఈ విషయం బయటకు తెలిసింది.  వీరిద్దరూ కలిసి ఓ హోటల్‌కు డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం ప్రచారం జరిగింది. ఆప్ ఎంపీ వీరి పెళ్లి గురించి చెప్పడంతో, ఆ వార్తలు వాస్తవాలేనని తేలిపోయాయి.


పెళ్లి పనులకు శ్రీకారం చుట్టిన పరిణీతిరాఘవ్ కుటుంబాలు     


పరిణీతి చోప్రా,   రాఘవ్ చద్దా నిశ్చితార్థ వేడుక జరిగిన నేపథ్యంలో త్వరలో పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.  పెళ్లికి  సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  వీరిద్దరు ఒక్కటి కాబోతున్నందుకు ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ప్రస్తుతం పరిణీత, రాఘవ్ బిజీగా ఉన్న నేపథ్యంలో, కొద్ది రోజుల్లో వారి వివాహ వేడుక గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారు” అని ఇరు కుటుంబ సభ్యుల సన్నిహితులు వెల్లడిస్తున్నారు.  


Read Also: 'ఇమ్మోర్టల్ అశ్వత్థామ'గా అల్లు అర్జున్ - బాలీవుడ్‌లో భారీ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా?