హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్  ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవాలని అనుకోవడం లేదు. అందుకే పథకాలు.. పదవులు అన్నీ హుజురాబాద్ కేంద్రంగానే అమలు చేస్తున్నారు.. భర్తీ చేస్తున్నారు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ పదవిని కేసీఆర్ భర్తీ చేశారు.  ఆ పదవిని కూడా హుజూరాబాద్ నియోజకవర్గ నేతకే ఇచ్చారు. టీఆర్ఎస్ సీనియర్ నేత..  టిక్కెట్ కోసం మొదట్లో ఆశలు పెట్టుకున్న వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అంతకు ముందు ఆయన బీసీ కమిషన్ సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు చైర్మన్ అయ్యారు. మరో ముగ్గుర్ని సభ్యులుగా నియమించారు.


హుజూరాబాద్ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్ అనే నేతకు కొద్ది రోజుల కిందటే ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించారు. అయితే ఇంకా ఆ నియామకానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. కేసీఆర్ పట్టుబడిేత గవర్నర్ ఆమోదముద్ర వేయక తప్పదు. ఇత పథకాలను కూడా పెద్ద ఎత్తున హుజురాబాద్ నుంచే అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా రేషన్ కార్డులు.. పించన్లు కొత్తగా ఇవ్వలేదు. కానీ హుజురాబాద్‌లో మాత్రం అడిగిన వారందరికీ ముంజూరు చేశారు. ఇక రైతు బంధు పథకాన్ని హుజురాబాద్ మొత్తం అమలు చేస్తున్నారు. కేసీఆర్ లాంఛనంగా పథకాన్ని ప్రారంభించారు. రూ. వెయ్యి కోట్ల నిధులు కూడా విడుదల చేశారు. తాజాగా బీసీ కమిషన్ చైర్మన్ పదవి కూడా హుజురాబాద్‌కే ప్రకటించారు. 


బీసీ కమిషన్ చైర్మన్ పదవి పొందిన వకుళాభరణం కృష్ణమోహన్ రావు కాంగ్రెస్ నేత .  2009 సాధారణ ఎన్నికల్లో ...ఆ తర్వాత  2010లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి ఈటల రాజేందర్ చేతిలో  ఓడిపోయారు.  2014లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.  ఆ తర్వాత టీఎస్‌లో చేరారు. కానీ ఆయనకు ఇప్పటి వరకూ పెద్దగా దక్కిన గుర్తింపు ఏమీ లేదు.  
తనను టిక్కెట్ ఇస్తారేమోనని వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రయత్నించారు. కానీ అలాంటి చాన్స్ ఏదీ లేకపోవడంతో ఏదో ఓ పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశల్ని కేసీఆర్ నెరవేర్చారు. తన రాజకీయ జీవితంలో బీసీ కమిషన్ సభ్యుడిగా చేసిన ఆయన ఇప్పుడు అదే కమిషన్‌కు చైర్మన్ అవుతున్నారు.  


హుజూరాబాద్‌లో దళితి, బీసీ వర్గాలను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో ఉన్నకేసీఆర్ ఇప్పటికే దళిత ఎజెండాను అమలు చేస్తున్నారు. బీసీ అభ్యర్థికి టిక్కెట్‌ను ప్రకటించారు. మరో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారు. మరో వైపు హరీష్ రావు ఈటల అనుచరుల్ని పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రత్యేకమన కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎ్పపుడు వస్తుందో తెలియకపోయినా ఈ పరిణామాలతో హుజూరాబాద్‌లో రాజకీయ వేడి తగ్గడంలేదు.