"ఎటు చూసినా అలజడి.. ఎవరిలో చూసినా భయంభయం.. ఎక్కడి వాళ్లు అక్కడే పరుగోపరుగు..".. ఆగస్టు 15 మధ్యాహ్నం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి ఇది.


కాబూల్ కు 15 కి.మీ దూరంలో తాలిబన్లు ఉన్నారనే వార్త తెలిసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి.. తాలిబన్లపై తిరగబడాలా.. అసలు అఫ్గాన్ సైన్యం ఏమైంది అనే ప్రశ్నలు. ఎటూ చూసినా జనాల పరుగులు.


ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నది 100 మంది ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్)  జవాన్లు. ఆ పరిస్థితుల్లో ఎంతో చాకచక్యంగా తాలిబన్ల బారి నుంచి వందల మంది భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చింది మన ఐటీబీపీ దళం. అందులో ముఖ్య భూమిక పోషించన సిక్కోలు జిల్లా వాసి ఐటీబీపీ జవాన్ వినోద్ కుమార్ మనోగతం ఆయన మాటల్లోనే విందాం. 


ఆగస్టు 15.. రాత్రి 7.30 సమయంలోనే తాలిబన్లు కాబూల్ చేరిపోయారు. వారిని చూడగానే అఫ్గాన్ భద్రతా దళాలు, సైన్యం వారికి మోకరిల్లాయి. అమెరికా దళాలు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినా కూడా అఫ్గాన్ సైన్యం ఇంత త్వరగా తాలిబన్లకు లొంగిపోవడం ఆశ్చర్యమే. ఈ వార్త వినగానే మాకు ఏం చేయాలో తెలియలేదు. వాళ్ల సైన్యమే చేతులెత్తేసిన వేళ.. మేం 100 మంది ఐటీబీపీ దళాలు వారిని ఎలా ఎదుర్కోగలం అని ఆలోచించాం. మన దేశ ప్రభుత్వం నుంచి కూడా మాకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. అప్పుడు మా ఆలోచన అంతా ఒకటే. వీలైనంత మంది భారతీయులకు ఈ సమాచారాన్ని అందించి.. వారిని సురక్షితంగా ఉంచాలి అనుకున్నాం.


ప్రాణాలు పోయినా సరే..


ఈలోగా అక్కడి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు మూడు విమానాలు పంపుతున్నట్లు భారత ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న భారతీయులందరికీ ఎంబసీ నుంచి సమాచారం ఇచ్చాం. వీలైనంత మందిని భారత్ తీసుకువెళ్లాలని అనుకున్నాం. అయితే రోడ్లపై అఫ్గాన్ జనాలు.. భారీగా చేరారు. ఏ వాహనం వచ్చినా అడ్డుగా నిలబడుతూ తమను తీసుకువెళ్లాలంటూ కోరుతున్నారు. పైగా తాలిబన్లు కూడా ఎక్కడికక్కడ వాహనాలను ఆపుతున్నారు. మా ఆలోచన అంతా ఒకటే.. మా ప్రాణాలు పోయినా ఫర్వలేదు.. కానీ దేశం కోసం ఈ ఆపరేషన్ విజవంతంగా పూర్తి చేయాలి అనుకున్నాం.


పక్కా స్కెచ్..


కాబూల్ లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని ముందుగానే గ్రహించి 15 రోజులైనా సరిపడేలా డ్రై ఫ్రూట్స్ ను సిద్ధం చేసుకున్నాం. రెండు గ్రూపులుగా డివైడ్ అయి ఈ ఆపరేషన్ చేపట్టాం. ఈ మొత్తం ఆపరేషన్ ను కమాండెంట్ రవి గౌతమ్ పర్యవేక్షించారు. తాలిబన్లు వాహనాలను ఆపుతున్నారని తెలిసి అప్పటికే రెండు సార్లు ప్రయాణానికి సిద్ధమై విరమించుకున్నాం. తాలిబన్లను, అక్కడి జనాలను దాటుకొని పగటిపూట ప్రయాణం చేయడం అసాధ్యమని అర్థమైంది.


రాత్రి ప్రయాణం..


పూర్తి భద్రతతో 20 ల్యాండ్ క్రూయిజర్ లలో రాత్రి 11 నుంచి 12  సమయంలోనే ప్రయాణం చేశాం. కాబూల్ విమానాశ్రయం చేరిన తర్వాత మన ఎయిర్ క్రాఫ్ట్ లు ల్యాండ్ అవడానికి ఇచ్చిన ప్రదేశాలను ముందుగానే సెక్యూర్ చేశాం. ఎయిర్ పోర్ట్ మొత్తం నాటో దళాల రక్షణలో ఉంది. అయినా వేలాదిమంది విమానాశ్రయం గోడలు దూకి లోపలికి వచ్చారు. అయితే మా ఎయిర్ బేస్ దగ్గరికి జనాలు ఎవరూ రాకుండా మేమంతా ఓ వలయంలా ఏర్పడి మన భారతీయుల్ని సురక్షితంగా విమానం ఎక్కించాం. అయితే విమానం టేకాఫ్ అయ్యే వరకూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్కడికి అప్పటికే వేలాదిమంది ప్రజలు చేరిపోయారు. వారిని నియంత్రించడానికి అమెరికా దళాలు కాల్పులు కూడా చేశాయి. మొత్తానికి వీటన్నింటిని దాటుకొని మన విమానాలు టేకాఫ్ అయ్యాయి. వారందిరినీ సురక్షితంగా దిల్లీ చేర్చాం.


దేశం కోసం..


దిల్లీ చేరుకున్న తర్వాత ప్రయాణికుల ఆనందానికి అంతు లేదు. ఎంతో సురక్షితంగా తమని భారత్ చేర్చినందుకు మమ్మల్ని మెచ్చుకున్నారు. వాళ్ల కళ్లలో ఆనందబాష్పాలు చూసి మాకు మాటలు రాలేదు. దేశం కోసం ఇంత మంచి పని చేసినందుకు నిజంగా గర్వపడ్డాం. ఇంతకంటే ఏం కావాలి అనిపించింది. యావత్ దేశం మాపై చూపిన అభిమానానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఈ ఆపరేషన్ లో సిక్కోలు జిల్లా వాసులం ముగ్గురు ఉన్నాం. ఈ విషయం తెలిసి ఎంతోమంది ఫోన్ చేసి మరి మమ్మల్ని అభినందించారు. మా సేవను గుర్తించినందుకు చాలా ఆనందపడ్డాం. దేశం కోసం ప్రాణాలైనా అర్పించేందుకు ఎప్పుడూ సిద్ధమే.


                                   - వినోద్ కుమార్, ఐటీబీపీ జవాన్