తెలంగాణలో సమగ్రమైన పరిపాలనాపర సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అంతేకాక, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సత్వర భర్తీ, కొత్త జిల్లాల్లో సజావుగా విధుల నిర్వహణకు అవసరమైన పోస్టుల గుర్తింపు వంటి ఇతర అంశాల అధ్యయానికి కూడా నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ఉన్నత స్థాయి పరిపాలనా సంస్కరణల కమిటీని కేసీఆర్‌ నియమించారు. పరిపాలనా సంస్కరణలకు సంబంధించి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, పాలనాపరమైన మార్పులే లక్ష్యంగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ఒక కమిటీని సీఎం ఏర్పాటు చేశారు.


జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి గతంలోనే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఆ ఉత్తర్వుల మేరకు 33 జిల్లాల్లో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వం దాదాపు పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో పాలనాపరమైన సంస్కరణలను సీఎం ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలకు సంబంధించి అధ్యయనం కోసం స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌ శేషాద్రి అధ్యక్షుడిగా, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారు. ఈ కమిటీ వెంటనే పని ప్రారంభించి, నివేదికను సత్వరమే అందజేయాలని సీఎం ఆదేశించారు. 


రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా, 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరిపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జోనల్‌, బహుళజోన్స్‌లోనూ ట్రాన్స్‌ఫర్‌లు, పోస్టింగులు పూర్తయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జోనల్‌ ప్రక్రియ పూర్తయినందున వెంటనే ఖాళీల భర్తీపై దృష్టి సారిస్తామని తెలిపారు. జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్‌ జారీకి చర్యలు చేపట్టడం, జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్సులు, పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్న వేళ వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును, ఇంకా మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని ఆయన కమిటీకి సూచించారు.


అంతేకాక, ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్‌ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఏయే శాఖలకు పని ఒత్తిడి ఎంత ఉంది?.. అంచనావేసి దానికి అనుగుణంగా కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించి, ఇంకా సాంకేతికంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై అధ్యయనం చేయాలని నిర్దేశించారు. వివిధ పథకాల అమలులో ఇంకా మంచి పాలనా సంస్కరణలు తెచ్చి.. ప్రజలకు నిత్యం అవసరమైన విద్య, వైద్యం, పురపాలక, పంచాయతీ రాజ్‌ శాఖల్లో సేవల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైనా సూచనలు చేయాలని సీఎం ఆదేశించారు.


ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సీ లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎంవో అధికారులు శేషాద్రి, స్మితా సబర్వాల్‌, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.


Also Read: Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన


Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి