Cheemalapadu Fire Accident: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి పువ్వాడను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.






బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి పూరి గుడిసెలో సిలిండర్ పేలడానికి ఎలాంటి సంబంధం లేదని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి ఎంపీ నామా పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన నామా నాగేశ్వర రావు.. ఆత్మీయ సమ్మేళనం సభ ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉందని, సమావేశం ప్రారంభమయ్యే సమయంలో ఓ గుడిసెలో సిలిండర్ పేలిందని ఆయన తెలిపారు. 










ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, కొంత మంది కాళ్లు తెగిపోయాయని ఎంపీ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయిస్తామని నామా స్పష్టం చేశారు. అవసరమయితే క్షతగాత్రులను మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని, దురదృష్టకరమని నామా నాగేశ్వరరావు అన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. బాణసంచా వల్ల ఈ ప్రమాదం జరగలేదని తెలిపారు. 


చీమ‌ల‌పాడుఆత్మీయ సమావేశం పరిసరాల్లో జరిగిన దుర్ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఖ‌మ్మం జిల్లా పార్టీ నేతలతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందివ్వాలని ఆదేశించారు. మృతుడి కుటుంబం, క్ష‌త‌గాత్రుల‌ ఫ్యామిలీలను ఆదుకుంటామన్నారు కేటీఆర్. చీమలపాడు ఘటన పట్ల మంత్రి పువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుపున బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రును ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన తీరును నాయకులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.


వైరా నియోజవర్గం కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఈ నిప్పు రవ్వలు స్థానికంగా ఉన్న గుడిసెపై పడటంతో మంటలు చెలరేగాయి. గుడిసెను అంటుకున్న మంటల్ని చల్లార్చేందుకు వెళ్లి పలువురు కార్యకర్తలు లోపలికి వెళ్లారు. అయితే ఆ గుడిసెలో గ్యాస్ సిలిండర్ ఉండటాన్ని గుర్తించకపోవడం, ఆపై భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.