Delhi School Bomb Threat:


ఢిల్లీలో ఘటన..


ఢిల్లీలోని ఓ స్కూల్‌లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు రావడం కలవరం రేపింది. వార్నింగ్ వచ్చిన వెంటనే స్కూల్ యాజమాన్యం అలెర్ట్ అయింది. విద్యార్థులందరినీ బయటకు తరలించింది. సాదిక్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కి ఉదయం 10.49 నిముషాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్‌లో బాంబు పెట్టామని బెదిరించారు. ఇది చూసి టెన్షన్ పడిన యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపింది. మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపింది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తల్లిదండ్రులు కంగారు పడి స్కూల్‌కు వచ్చారు. బయట విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. "వెంటనే స్కూల్‌కి వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ స్కూల్ నుంచి మాకు మెసేజ్‌లు వచ్చాయి. ఏమైందో అని కంగారు పడిపోయి వచ్చేశాం" అని తల్లిదండ్రులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్కూల్‌లో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని స్పష్టం చేశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఇదే స్కూల్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. 




"ఈ స్కూల్‌కి బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి అడ్మిన్‌కు మెయిల్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ సమాచారం అందిన వెంటనే మేము బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌తో వచ్చాం"


- చందన్ చౌదర్, పోలీస్ ఉన్నతాధికారి