Ravi Babu: టాలీవుడ్ లో ఉన్న విలక్షణ దర్శకుల్లో రవిబాబు ఒకరు. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు అన్నీ సరికొత్తగా ఉంటాయి. మరోవైపు నటుడుగానూ తన మార్క్ ను చూపిస్తున్నారు. కామెడీ డ్రామా, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఆయనకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. ‘అల్లరి’ వంటి కామెడీ సినిమాలు చేసిన రవిబాబు తర్వాత ‘అనసూయ’, ‘అవును’, ‘అమరావతి’ వంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించారు. రవిబాబు మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘అసలు’ పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 


ఇటీవలే ‘అసలు’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లర్ అంశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ దారుణమైన హత్యను చేధించే పనిలో ఉంటాడు ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ హత్య వెనుక ఓ రహస్యాలు ఏమిటి ఆ నలుగురు అనుమానితులకు హత్యకు సంబంధం ఏంటి అనే అంశాలను సినిమాలో చూడొచ్చు. సాధారణంగా రవిబాబు సినిమాలలో సస్పెన్స్ అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో పాటు ఒకింత భయం కూడా కలుగుతుంది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా అలాగే ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.


ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈటీవీ విన్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అయితే తాజాగా ఈటీవీ విన్ ‘అసలు’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను చేసింది. సినిమా చూసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ హెచ్చరించింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అసలే ఈ మధ్య కాలంలో సరైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తక్కువగా వచ్చాయి. వాటిలో ‘మసూద’ సినిమా ఒక్కటే పర్వాలేదనిపించింది. దీంతో ఇప్పుడు రవిబాబు సినిమాపై ఆసక్తి నెలకొంది. 


ఇక ఈ సినిమాలో రెండు విషయాలు కామన్ గా కనిపిస్తున్నాయి. ఒకటి సినిమాలో నటిస్తోన్న నటి పూర్ణ. ఈమె గతంలో కూడా రవిబాబు తీసిన ‘అవును’ సిరీస్ సినిమాల్లో నటించింది. మరోసారి ఈ థ్రిల్లర్ సినిమాలో నటించింది. అలాగే రవిబాబు మొదటనుంచీ తీస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు అన్నీ ‘అ’ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. ‘అల్లరి’, ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును 1,2’ ఇలా.. ఇప్పుడు ఈ సినిమాకి కూడా మొదటి అక్షరం అ వచ్చేలా ‘అసలు’ అని పేరు పెట్టారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5 న ఓటీటీలో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 13 న సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 


Read Also: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?