Children Protest Against Dogs Attacking Incidents: 'సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ కుక్కల దాడుల నుంచి మాకు రక్షణ కల్పించండి.' అంటూ చిన్నారులు ఫ్లకార్డులతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అంతేకాకుండా ఏకంగా మున్సిపల్ కమిషనర్‌పైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లకు చెందిన చిన్నారులు తల్లిదండ్రులతో సహా ఆదివారం పోలీస్ స్టేషన్‍‌కు చేరుకుని అధికారులపై ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లిలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. దొరికిన వాళ్లని వేటాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు.


మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్‌పై ఫిర్యాదు


ఈ క్రమంలోనే పలు కాలనీలకు చెందిన చిన్నారులు కొంపల్లి మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ లపై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతమంది పిల్లలు ఒకేసారి స్టేషన్‌కు రావడం చూసిన స్థానికులు ఆశ్చర్యంతో పాటు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని.. వాటి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని చిన్నారులు, కొందరు తల్లిదండ్రులు మండిపడ్డారు. నిర్లక్ష్యం వహిస్తోన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 'సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.


బాలుణ్ని చంపేశాయి


కాగా, హైదరాబాద్ నగరంలో చిన్నారులపై కుక్కల దాడుల ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల జవహర్‌నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటోన్న బాలునిపై కుక్కలు దాడి చేశాయి. స్థానికులు స్పందించి కుక్కలను తరిమేసి.. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, బాలుని పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులకు నిర్దేశించారు. వీధి కుక్కల గురించి సమాచారం ఇచ్చేందుకు కాల్ సెంటర్ లేదా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 


కుక్కల దాడులు చేయకుండా చేపట్టాల్సిన చర్యలపై బ్లూక్రాస్ వంటి సంస్థలు, పశు వైద్య నిపుణులతో మాట్లాడాలని సీఎం అధికారులకు సూచించారు రేవంత్. కుక్క కాటుకు గురై ఆసుపత్రికి వచ్చే వాళ్లకు అవసరమైన వ్యాక్సిన్లు, మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కుక్క కాటు చికిత్స మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 


హైకోర్డు సీరియస్


మరోవైపు, కుక్కల దాడుల ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేసిన ఉన్నత న్యాయస్థానం.. ఈ సమస్యపై పరిష్కార మార్గాలతో రావాలని, కుక్కల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందిన ఘటనలు రోజురోజుకు వెలుగు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని పేర్కొంది. రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైర విహారం ఎక్కువైందని.. వ్యర్థాలను నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. ఖరీదైన కాలనీల్లో సంఘటనలు జరగడం లేదని.. పేదలు నివసిస్తోన్న మురికివాడలపై దృష్టి సారించాలని సూచించింది. కుక్కల నియంత్రణపై ఓ కమిటీ ఏర్పాటు చేయడం సహా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులకు నిర్దేశించింది.