14 Hour Workday: ఐటీ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్‌పై చాలా రోజులుగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి ఆ మధ్య కొన్ని కామెంట్స్ చేశారు. పని గంటల గురించి పట్టించుకోవద్దని, ప్రొడక్టివిటీ గురించి మాత్రమే ఆలోచించాలని అన్నారు. అంతే కాదు. అప్పట్లో వారానికి 70 గంటలు పని చేసే వాళ్లమని, ఇప్పుడు ఉద్యోగులంతా దీన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి పని గంటల గురించి డిబేట్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఈ చర్చ జరిగేలా చేస్తోంది. ఐటీ ఉద్యోగుల పని గంటల్ని 14 గంటలకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ వార్త అలా బయటకు వచ్చిందో లేదో వెంటనే ఐటీ ఉద్యోగులు తీవ్రంగా మండి పడ్డారు. అంత కన్నా అమానుషం ఇంకోటి లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని గంటలు పని చేస్తే తమ ఆరోగ్యం ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. Karnataka Shops and Commercial Establishments Act చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే...ఇందులో ఐటీ కంపెనీలూ కొన్ని ప్రతిపాదనలు చేశాయి. వర్కింగ్ అవర్స్‌ని అధికారికంగా 14 గంటలకు పెంచాలని కోరాయి. 12 గంటల్ని  వర్కింగ్‌ అవర్స్‌గా ప్రకటించి మిగతా 2 గంటల్ని ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తామని వెల్లడించాయి. ప్రస్తుతానికి లేబర్ లా ప్రకారం 12 గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్ ఉండాలి. అందులో 10 గంటలు నార్మల్ వర్కింగ్ అవర్స్ కాగా, మిగతా రెండు గంటలు ఓవర్‌టైమ్‌గా పరిగణిస్తున్నారు. 


ఉద్యోగుల అసహనం..


ఐటీ కంపెనీల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే..త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. కేబినెట్‌లోనూ దీనిపై చర్చ జరగనుంది. ఐటీ ఉద్యోగులు మాత్రం ఈ ప్రతిపాదనలపై తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రస్తుతానికి ఐటీ కంపెనీలు మూడు షిఫ్ట్‌లలో పని చేస్తున్నాయి. ఇలా పని గంటలు పెంచడం వల్ల రెండు షిఫ్ట్‌లకే పరిమితమయ్యే అవకాశముంది. ఈ షిఫ్ట్‌లపైనే ఆధారపడిన క్యాబ్‌ సర్వీస్‌లు సహా మరి కొన్ని విభాగాలపై ప్రభావం పడనుంది. పైగా ఉద్యోగుల ఆరోగ్యంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్ని గంటల పాటు పని చేస్తే మేమైపోవాలని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఇప్పటికే ఐటీ సెక్టార్‌లో ఉన్న వాళ్లలో కనీసం 45% మంది మానసిక ఆందోళనతో సతమతం అవుతున్నారు. 55% మంది శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ పని గంటలు పెంచితే ఇంకా ఇబ్బందులు తప్పవని తేల్చి చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని, ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఏ ప్రకటనా చేయలేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఐటీ ఉద్యోగులను ఈ ప్రతిపాదనలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే లేఆఫ్‌ల టెన్షన్‌తో సతమతం అవుతున్న ఉద్యోగులు ఇప్పుడీ కొత్త తలనొప్పేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ ప్రకటన చేస్తుందో చూడాలి. 


Also Read: Serial Killer: 42 మంది మహిళల్ని చంపి ముక్కలు చేసి, ఒక్కో అవయవం ఒక్కో సంచిలో కుక్కి - సైకో కిల్లర్‌ సంచలనం