Case On KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై పంజాగుట్టలో చీటింగ్ కేసు నమోదయింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి కేఏ పాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్ టిక్కెట్ ఇస్తామని చెప్పి రూ. యాభై లక్షలు తీసుకున్నారని కానీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. రూ. 30 లక్షలు ఆన్ లైన్‌లో.. రూ. 20 లక్షలు నగదు ద్వారా చెల్లించానని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరమ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది నవంబర్‌లోనే ముగిశాయి. ఆ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు. ఆయన పార్టీ ఇన్ యాక్టివ్ గా మారడంతో.. ఈసీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కామన్ సింబల్ ఇవ్వాలంటూ కేఏ పాల్ రచ్చ చేశారు. అయితే చివరికి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టలేదు. ఇటీవలి ఎన్నికల్లో వరంగల్ నుంచి బాబూమోహన్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించినప్పటికీ.. చివరికి బాబూమోహన్ కూడా.. హ్యాండిచ్చారు.
కేఏ పాల్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల కోసం వెదుక్కుంటూ ఉంటారు. ఆయన పార్టీకి డబ్బులు ఇచ్చి మరీ టిక్కెట్ తీసుకునే వాళ్లు ఉంటారా అని ఈ కేసు గురించి తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. అది కూడా యాభై లక్షల మొత్తం కావడంతో పోలీసులు కూడా పాల్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఇంత మొత్తం ఇస్తారా అని ఆరా తీస్తున్నారు. కేఏ పాల్ స్వయంగా పోటీ చేసినా రెండు, మూడు వేల ఓట్లు రావడం కష్టం. మునుగోడులో కేఏ పాల్ పోటీ చేస్తే మూడు వేల ఓట్లు వచ్చాయి. ఆయన పార్టీ తరపున నిలబెట్టడానికి అభ్యర్థులు కూడా లేరు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోయారు. ఏపీలో కూడా తాను ఒక్కరే నిలబడ్డారు. పలువురుకి బీఫాంలు ఇచ్చినప్పటికీ వారెవరో ఎవరికీ తెలియదు. కనీసం ప్రచారం చేసే వారు కూడా లేరు. కేఏ పాల్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. తనకు పది లక్షల ఓట్లు పడ్డాయని తానే గెలవబోతున్నట్టు పాల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాను గెలవబోతున్నట్టు ఇంటెలిజెన్సీ వాళ్లు కూడా తనతో చెప్పారని ఆయన అంటున్నారు.
కేఏ పాల్ పై కేసు వెనుక దురుద్దేశం ఉందని.. ఆయన పార్టీ టిక్కెట్లకు డబ్బులు ఇచ్చే వారు ఉండరని .. పాల్ సానుభూతి పరులు చెబుతున్నారు. ఈ కేసుపై ప్రస్తుతం విశాఖలో ఉన్న కేఏ పాల్ స్పందించాల్సి ఉంది.