Chandrababu focused on  Telangana TDP  : తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఓ దారిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.  టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలు పై తెలంగాణ నేతలతో చర్చించనున్నారు.  టీటీడీపీ ముఖ్య నేతల సమావేశంలో అధ్యక్షుడి ఎంపికను ఓ కొలిక్కి తీసుకు రావాలని భావిస్తున్నారు.              


స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీని సిద్ధం చేస్తున్న చంద్రబాబు              
 
వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అత్యధిక ఓటు శాతం ఉన్న బీసీలకు దగ్గర అయ్యేందుకు బీసీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.   ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు బడుగు, బలహీన వర్గాల నేతలకే పదవులు ఇచ్చారు.  మొన్నటివరకు ఆ పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ లో చేరారు. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాతో పార్టీకి అధ్యక్షుడు లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఉనికి స్తంభించిపోయింది. అయితే మళ్ళీ తెలంగాణలో పార్టీ నిర్మాణం పై దృష్టి పెడతానని, పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొస్తానని బాబు చెబుతున్నారు.  గడిచిన పదేళ్ళలో ముగ్గురు బడుగు, బలహీనవర్గాలకు చెందిన నేతలకే చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలుగా అవకాశం ఇచ్చారు.          


కాసాని రాజీనామా తర్వాత తెలంగాణ టీడీపీకి లేని అధ్యక్షుడు                                   


రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉండాలంటే రాష్ట్ర అధ్యక్ష పదవి అవసరం. కేడర్ కు దిశానిర్దేశం, నేతలను సమన్వయం చేయడం,కార్యకర్తల్లో ఉత్సాహం నింపలంటే సమర్థవంతమైన నాయకుడు అవసరం. అందుకే పార్టీ అధినేత ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు బాధ్యతలు అప్పగిస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి చాటుకునే అవకాశం ఉంటుంది. ఈ దిశగా చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. యువకుడికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుపుతున్నాయి.             


కొంత మందికి నామినేటెడ్ పోస్టులు 


ఏపీలో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత  కొంత మంది తెలంగాణలోని సీనియర్ నేతలు, పార్టీకోసం పనిచేస్తున్నవారికి కూడా  కొన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది.  టీటీడీ మెంబర్ లుకా  తెలంగాణ నుంచి ఒకరిద్దరికి అవకాశం కల్పిస్తారు. గతంలో పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే వారికి చాన్సిచ్చేవారు. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు లేరు. టీటీడీ బోర్డు మెంబర్లుగా  నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరొకరికి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు  అంచన వేస్తున్నాయి.  దమూరి సుహాసినికి   ఏదో ఒక బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది.