Srikakulam News: రాజకీయంగా తనను మొదటి నుంచి అడ్డుపడుతున్న వాణి తను ఐదు సార్లు ఓడిపోవడానికి కూడా కారణమయ్యారని ఆరోపించారు. నామినేషన్ వేసిన ప్రతి సారి బ్లాక్ మెయిల్ చేసి తనను చికాకు పరిచేవారని అన్నారు. అలాంటి పరిస్థితిలో వ్యూహాలు వేయడంలో వెనుకబడి ఓటమిపాలయ్యానని చెప్పారు. 2024 ఎన్నికల్లో అయితే తను ఓటమి కోసం భార్య వాణి, మామ రాఘవరావు కలిసి తిరిగారని అన్నారు. టీడీపీ నేతలతో ఇంటింటికీ వెళ్లి టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారని తెలిపారు. చివరకు తన భార్య కూడా ఓటు వేయలేదని చెప్పుకొచ్చారు. ఇలాంటివి చెప్పుకుంటే జనాల్లో పలచన అవుతామని తెలిసినా పరిస్థితి తీవ్ర చెప్పేందుకు తప్పడం లేదన్నారు. 


ఓటమితో దెబ్బతిన్న తనను మరింతగా దెబ్బ తీసేందుకు టీడీపీ నేతలు ముఖ్యంగా అచ్చెన్నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్. వేరేలా ఇబ్బంది పెడితే రెడ్ బుక్ రాజ్యాంగమని ఆరోపణలు చేస్తామని గ్రహించి ఇలా ఫ్యామిలీ వివాదాలను వాడుకుంటున్నారని అన్నారు. రెండు రోజుల నుంచి ఓ ఎమ్మెల్సీ ఇంటి ముందు హడావుడి జరుగుతుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. ఓ వైసీపీ లీడర్ ఇలా వీరంగం చేస్తుంటే పోలీసులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 


టీడీపీ అండగా లేకుంటే పోలీసులు ఎందుకు వారిని ఎందుకు అక్కడి నుంచితీసుకెళ్లడం లేదని నిలదీశారు. వారిని అక్కడే ఉండాలని అచ్చెన్నాయుడే చెబుతున్నారని పోలీసులు వారి జోలికి వెళ్లొద్దని కూడా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. తనకు ఏం జరిగినా అచ్చెన్నాయుడు, ప్రభుత్వం, వాణిదే బాధ్యతని హెచ్చరించారు దువ్వాడ శ్రీనివాస్. 


ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న మాధురిని పరిచయం చేసిందే వాణి అని చెప్పుకొచ్చారు శ్రీనివాస్. గుర్తింపు ఉన్న పదవి ఇస్తే కచ్చితంగా పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పారన్నారు. అయితే రాజకీయంగా ఆమెను తీసుకొచ్చారని అనుకున్నానే తప్ప తనపై ప్రయోగించేందుకు తీసుకొచ్చారని ఎప్పుడూ ఊహించలేదన్నారు. తనతో చాలా మంది కార్యకర్తలు ట్రిప్‌లకు వస్తుంటారని అలానే ఆమె కూడా వచ్చారని దాన్నే హైలైట్ చేయడం సరికాదన్నారు. 


ఇలాంటివి అన్నీ చూపించి అధినాయకత్వం వద్ద కూడా తనను దోషిగా నిలబెట్టారని వాపోయారు దువ్వాడ. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా మాధురికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. ఇలా ప్రతి చోట చేసిన దుష్ప్రచారంతో ఆమె పరువు పోయిందని వాళ్ల ఇంట్లో కూడా విభేదాలు వచ్చాయని అన్నారు. వాణి చేసిన పనికి మాధురి జీవితం రోడ్డున పడిందని తెలిపారు. 


మహిళను వాడుకొని తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వాణీ ప్రయత్నించిందన్నారు దువ్వాడ శ్రీనివాస్. జీవితం నాశనమైపోతుందన్న పరిస్థితుల్లో మాధురి సూసైడ్ చేసుకునేందుకు యత్నించిందన్నారు. ఓ హోటల్‌లో హ్యాంగ్ చేసుకుందని తాను కాపాడి ధైర్యం చెప్పానని తెలిపారు. అప్పటికే తను కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టు వివరించారు. కారులో పడుకోవడం, భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న టైంలో మాధురికి దగ్గరయ్యానని పేర్కొన్నారు. తనకు నేను ఉన్నానని ధైర్యం చెప్పానని ప్రాణాలు తీసుకోవాల్సిన పని లేదని భరోసా ఇచ్చినట్టు వివరించారు. 


రెండేళ్ల నుంచి ఇద్దరం కలిసి తిరగడం ప్రారంభించామన్నారు దువ్వాడ. కలిసి ఉంటున్నామని అయితే పెళ్లి చేసుకోలేదని దీన్ని న్యాయ పరిభాషలో అడల్టరీ అంటారని అన్నారు. ఇంట్లో భోజనం సౌకర్యం లేనప్పుడు ఇన్ని రోజులు ఎలా బతికాను. ఎలా ఉన్నావు అని అడిగేవాళ్లు లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వాణి ఒక్కసారైనా అడిగారా... కుమార్తెలు అయినా అడిగారా అని ప్రశ్నించారు. రెండేళ్లు మాధురియే అన్నీ అయి తనకు అండగా నిలబడి ఉందన్నారు. పెళ్లిపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని అది దైవ నిర్ణయమని అన్నారు. 


తనను బ్లాక్ మెయిల్ చేయడనికి తన వద్ద ఈ ఇల్లు తప్ప ఏమీ లేదన్నారు దువ్వాడ. ఈ ఇల్లు కూడా వాళ్లకు రాసిస్తే తనను నడిరోడ్డుపై నిలబెట్టరని గ్యారంటీ ఏంటీ ప్రశ్నించారు. వాణీది తనది లవ్‌ మ్యారేజ్ కాదన్నారు. తన తల్లి, వాణి తల్లి అక్కచెల్లెల్లు అని దగ్గర సంబంధం కారణంగా పెళ్లి చేశారని చెప్పారు. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత కూడా నన్ను వదిలి వచ్చేయామని వాణి నాన్న అన్న మాట నిజమేనని అన్నారు. 


అధికారంలో లేని ఈ టైంలో తనను అనేక సమస్యలు చుట్టుముట్టబోతున్నాయని ఇలాంటి టైంలో తనతో ఉండాలనే కచ్చితంగా గుండె ధైర్యం ఉండాలన్నారు దువ్వాడ. ఇప్పుడు మాధురి తనతో ఉంటే ఆమెను కూడా సమస్యలు వెంటాడుతాయన్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. 


చాలా మంది పురుషులు తప్పులు చేసినా భార్యలు కాపాడుకుంటున్నారు. అలాంటి వారి మగవాళ్లు జీవితాలు వర్ధిల్లుతున్నాయని అన్నారు. భారతీయ స్త్రీలు వాణీలా ప్రశ్నించడం మొదలు పెడితే వివాహ వ్యవస్థ కుప్పకూలులుతుంది చెప్పుకొచ్చారు. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని రకాలుగా అవమానించిన తర్వాత కలిసి ఉండలేమని అన్నారు. తన భార్యకు విడాకులు ఇచ్చి మాధురితో కలిసి ఉంటానన్నారు.