Rajbhavan Renuka : రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హంగామా సృష్టించారు. కార్యకర్తలతో కలిసి రాజ్‌భవన్‌వైపు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డగించారు. మహిళా పోలీసులు ఆమెను చుట్టు ముట్టి ముందుకు పోనీయకుండా చేశారు. దీంతో ఆమె ఒక్క సారిగా శివాలెత్తిపోయారు. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారిని ఒక్క సారిగా మోచేత్తో పొడిచారు. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఎస్‌ఐ చొక్కా కూడా పట్టుకున్నారు.
ఓ వైపు ఇతర నేతలు రాజ్ భవన్ వైపు దూసుకెళ్తూంటే.. రేణుకా చౌదరిని కంట్రోల్ చేయాడానికి మహిళా పోలీసులు తంటాలు పడాల్సి వస్తోంది. తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తూంటే.. పోలీసులు కుట్ర పూరితంగా ఉద్రిక్తతలు పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. అతి కష్టం మీద రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు .. స్టేషన్‌కు తరలించారు.
మరో వైపు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం వ్యూహాత్మకంగా చేపట్టడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. మొదట ఉదయమే ఐదున్నరకు కొంత మంది కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఆ తర్వాత ఇంకెవరూ రారని పోలీసులు అనుకున్నారు. కానీ ఒక్క సారిగా కాంగ్రెస నేతలు, కార్యకర్తలు అన్ని వైపుల నుంచి తరలి రావడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. అప్పటికప్పుడుపెద్ద ఎత్తున బలగాలను తెప్పించినా ప్రయోజనం లేకపోయింది. రాజ్ భవన్ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ చేశారు.
రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలందరూ రాజ్ భవన్ రోడ్డుకు చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా తంటాలు పడ్డారు. పోలీసులు అడ్డుకోవడం నేతలంతా ఎక్కడిక్కడ బైఠాయించారు. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండటంతో ముఖ్య నేతల్ని అక్కడ్నుంచి తరలించడానికే పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ లోపే కార్యకర్తలు రోడ్డుపై ఉన్న ప్రభుత్వ వాహనాలపై విరుచుకుపడ్డారు.బస్సులపై దాడి చేశారు. బస్సులపైకి ఎక్కి గందరగోళం సృష్టించారు. ఓ బైక్‌ను సైతం తగలబెట్టడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.