ఐటీ ఎంప్లాయ్ నుంచి బిజినెస్‌మేన్‌గా
గొప్ప ఉద్యోగం చేసిన వాళ్లు కాదు వాటిని వదిలేసిన వాళ్లు గొప్పవాళ్లు. అదేంటి పెద్ద జాబ్‌లు వదులుకోవటం గొప్పా..? అంటారా. ఈ రోజుల్లో ఈ సూత్రమే బాగా వర్కౌట్ అవుతోంది మరి. నెలంతా కష్టపడితే లక్ష రూపాయల జీతం వచ్చినా ఎవరూ పెద్దగా సంతృప్తి చెందటంలేదు. అదే సొంతగా వ్యాపారం పెట్టుకుని నెలకు 50 వేలు సంపాదించుకున్నా సాటిస్ఫై అయిపోతున్నారు. అందరికీ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌పైనే శ్రద్ధ పెరుగుతోంది. అందుకే లక్షల రూపాయల ప్యాకేజీలొచ్చే ఉద్యోగాలు వదులుకుని బిజినెస్ మేన్‌లుగా మారిపోతున్నారు. కర్ణాటకలోని ఓ వ్యక్తి ఇదే చేశాడు. ఐటీ ఉద్యోగం వదిలేసి ఓ వింతైన బిజినెస్ మొదలు పెట్టాడు. ఏంటా అది అంటారా..? గాడిద పాల వ్యాపారం. అవును గాడిద పాలు అమ్మటమే ఆయన బిజినెస్.
గాడిద పాలతో వ్యాపారమా..?
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ ఐటీ ఉద్యోగం వదిలి రూ. 42 లక్షలతో గాడిద పాల వ్యాపారం ప్రారంభించాడు. ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యాపారం మొదలు పెట్టిన తొలి వ్యక్తిని తానేనని చాలా గర్వంగా చెబుతున్నాడు శ్రీనివాస్. 2020 వరకూ ఐటీ ఉద్యోగంలోనే ఉన్నాడు.
కరోనా తరవాత తన ఆలోచనల్లో మార్పు వచ్చింది. సొంతగా వ్యాపారం పెట్టుకుని ఎదగాలని అనుకున్నాడు. ఇంకా ఆలస్యం చేసి టైమ్ వేస్ట్ చేయటం కన్నా తొందరగా నిర్ణయం తీసుకోవటం మంచిదని భావించాడు.
వెంటనే 20 గాడిదల్ని కొనుగోలు చేసి వ్యాపారం మొదలు పెట్టాడు. గాడిద పాలతో ఆరోగ్యపరంగా ఎన్నోప్రయోజనాలున్నాయని అంటున్నాడు శ్రీనివాస్. ఆ లాభాలేమిటో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నాడు. గాడిద పాలను అందరికీ చేరువ చేయాలనేదే తన లక్ష్యమని చెబుతున్నాడు. గాడిదల సంఖ్య తగ్గిపోతోందని, ఇలా వ్యాపారం చేయటం ద్వారా వాటి మనుగడను కాపాడటంతో పాటు రెండు చేతులా సంపాదించుకునే అవకాశం లభించిందని అంటున్నాడు. మొదట్లో గాడిద పాల వ్యాపారం అనగానే చాలా మంది నవ్వుకున్నారని, కానీ ఇప్పుడీ వ్యాపారంతో లాభాలు గడిస్తుంటే వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారని వివరిస్తున్నాడు శ్రీనివాస్. 30 ఎమ్‌ఎల్ పాల ప్యాకెట్‌కి రూ. 150 వసూలు చేస్తున్నాడు. ఈ మిల్క్ ప్యాకెట్లు అన్ని సూపర్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంటాయట.