AP High Court Refuses MP Raghurama Petition: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఝలక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఆయన వేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని స్పెషల్ మార్జిన్‌ మనీ పేరుతో ఏపీ స్టేట్ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, అక్కడ దాన్ని ఆదాయంగా చూపడం ద్వారా వివిధ మార్గాల ద్వారా రుణాలు పొందడాన్ని ఎంపీ రఘురామ తప్పుబట్టారు. దాన్ని సవాలు చేస్తూ ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. అయితే, ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమని వెల్లడించింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని, ఒకవేళ ఏవైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్లాలని సూచించింది. 


ఆ డబ్బు ట్రెజరీకి కాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ కు..
లిక్కర్ సేల్స్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వం బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, దానిని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేలా, ఏపీ మద్యం చట్టానికి సవరణ చేసింది. ఈ సవరణ చట్టాలను (యాక్ట్‌ 31/2021, యాక్ట్‌ 9/2022) రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ హైకోర్టుకు వెళ్లారు. బుధవారం (జూన్ 15) ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ.. ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు(సంచిత నిధి) జమచేయాలని, కానీ ప్రభుత్వం అలా ట్రెజరీకి చెందేలా చేయడం లేదని అన్నారు. ఆ ఆదాయాన్ని బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి దాన్ని ఆదాయంగా చూపి, హామీ ఇస్తూ రుణం పొందుతున్నారని వాదించారు. 


ఇది రాజ్యాంగ ఉల్లంఘనే - పిటిషన్ దారు
లిక్కర్ సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చిన సొమ్మును ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌‌లో షూరిటీగా చూపి తాజాగా రూ.8 వేల కోట్లకుపైగా రుణం పొందినట్లు ధర్మాసనానికి వివరించారు. కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.


మేం జోక్యం చేసుకోం, మేమేం సెక్రెటరీలం కాదు - హైకోర్టు
దీనిపై స్పందించిన హైకోర్టు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో తాము ఎలా జోక్యం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. రుణం ఎలా పొందాలో ప్రభుత్వాన్ని ఆదేశించడానికి మీరెవరని ప్రశ్నించింది. ఆర్థిక వ్యవహారాలు పరిశీలించే పని తమది కాదని, తాము కంపెనీ సెక్రటరీలం కాదని చెప్పింది. ఇది ప్రజాహిత పిటిషన్ కాదని.. అనవసర వ్యాజ్యం అని, విచారణకు స్వీకరించబోమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, క్రమ శిక్షణ ఆర్బీఐ, కాగ్‌ చూసుకుంటాయని స్పష్టం చేసింది.