కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నేడు (డిసెంబర్ 2) కీలక సమావేశం జరగనుంది. కృష్ణాజలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నెలకొన్ని తాజా పరిస్థితులు దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు బదిలీచేసే అంశంపై ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఇరు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
అంతకుముందు, నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలన్న కేంద్రహోంశాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. డ్యామ్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడంతో పాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అంగీకరించాయి. నాగార్జున సాగర్ వివాదంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్షలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.
దీనికి ముందు కృష్ణాబోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో తెలిపింది. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి లేఖ అందలేదని తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ముందు అడగకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని కేఆర్ఎంబీ ప్రశ్నించారు.