Kishan Reddy Slams Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని.. రాహుల్ గాంధీ కోసం బిల్డర్లను బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్ కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ (Telangana) నుంచి ఢిల్లీకి సూట్ కేసులు వెళ్తున్నాయని మండిపడ్డారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సనత్ నగర్ కు చెందిన వెల్లాల రామ్మోహన్ శుక్రవారం కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర్ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ నాణేనికి బొమ్మా బొరుసులాంటివని.. ఆ రెండు పార్టీలు మజ్లిస్ అడుగుజాడల్లో పని చేస్తున్నాయని అన్నారు. 'భద్రాచలం ఆలయం కోసం ప్రధాని మోదీ రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. ఆయన కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న అతి ప్రాచీన, ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీకే దక్కుతుంది.' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


'మోదీతోనే తెలంగాణ అభివృద్ధి'


గత తొమ్మిదన్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. 'రూ.450 కోట్లతో కాచిగూడ, రూ.350 కోట్లతో నాంపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్, రూ.400 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఎయిర్ పోర్ట్ తరహాలోనే సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్ కానుంది. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలి. రాష్ట్రంలో రూ.1.20 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్ ఆర్ రోడ్డును కేంద్రం మంజూరు చేసింది. తెలంగాణ అభివృద్ధిలో ఇది గేమ్ ఛేంజర్. కాంగ్రెస్ హయాంలో ఎంపీలు, మంత్రులు అవినీతి ఆరోపణలతో, కుంభకోణాలతో జైలుకు వెళ్లారు. తొమ్మిదన్నరేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతీ జరగలేదు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా భారత్ ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. అందులో భాగస్వామ్యం అయ్యేందుకు మనం సిద్ధం కావాలి.' అని పేర్కొన్నారు.


గిరిజన మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన


అటు, హైదరాబాద్ అబిడ్స్ లోని రాంజీ గోండు పేరుతో గిరిజన మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని.. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రాంజీ గోండు పోరాడారని కొనియాడారు. దేశవ్యాప్తంగా 10 ట్రైబల్ మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నామని.. ఏపీలోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని అన్నారు. ఆయనకు ఎన్ని లేఖలు రాసినా.. స్పందించలేదని.. ఇవాళ శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. 'ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు కాబోతుంది. గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసింది. గిరిజన వర్శిటీకి మొదిటి విడతలో రూ.900 కోట్లు కేటాయించాం. రూ.420 కోట్లతో 17 ఏకలవ్య పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించాం. మేడారం జాతరకు రూ.3 కోట్ల వరకూ కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. గిరిజనుల భూములకు హక్కులు కూడా కల్పిస్తున్నాం. వారి సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది.' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.





Also Read: Bandi Sanjay : బీజేపీతో టచ్‌లో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - బండి సంజయ్ కీలక ప్రకటన