Kishan Reddy Comments On Yadadri MMTS: హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్‌ను (MMTS) పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. దీనికి సంబంధించి నిర్మాణ పనులు త్వరలో చేపడతామని చెప్పారు. రూ.430 కోట్లతో కొనసాగుతోన్న చర్లపల్లి టెర్మినల్ (Charlapalli Terminal) నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేశామన్నారు. 'స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి తెలంగాణకు రైల్వేల విషయంలో అన్యాయం జరిగింది. నూతన రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు చర్లపల్లి నాలుగో నూతన రైల్వే స్టేషన్‌గా రాబోతోంది. దీని ద్వారా హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గుతుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను తక్కువ టైంలోనే నిర్మించాం. ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయి.' అని పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి


చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.430 కోట్లతో నిర్మించామని.. రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు కొత్త టెక్నాలజీతో అన్ని సదుపాయాలు కల్పించామని కిషన్ రెడ్డి తెలిపారు. 'దివ్యాంగులు, వృద్ధులకు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేశాం. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్లడానికి కనెక్టివిటీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. భరత్ నగర్, మహాలక్ష్మినగర్ వైపున 80 అడుగుల మేర రోడ్లు కావాలి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని వెంటనే అమలు చేయాలి. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో రోడ్ కనెక్టివిటీ ఉంటేనే ఉపయోగం ఉంటుంది.' అని స్పష్టం చేశారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను (Secunderabad Railway Station) అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకితం చేస్తారని వెల్లడించారు. అమృత్ పథకంలో భాగంగా స్థానికంగా ఉన్న అన్నీ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.430 కోట్లతో చర్లపల్లి, రూ.715 కోట్లతో సికింద్రాబాద్, రూ.429 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్లలో పనులు ప్రారంభించినట్లు వివరించారు. రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్ మానిఫ్యాక్చురింగ్ యూనిట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.






వందేభారత్ రైళ్లు ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో వందేభారత్ ట్రెయిన్లలో స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.


Also Read: Revanth Reddy: త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1, లీడర్లకు 2 లక్షణాలు తప్పక ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి