Celebrations in PV Narasimha Rao Home Town: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు (PV NarasimhaRao) కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించడంపై ఆయన స్వగ్రామంలో సంబురాలు చేసుకున్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లా భీమదేవరపల్లిలోని వంగరలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు నిర్వహించారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చి.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టి గ్రామంలో ర్యాలీ తీశారు. ఆయన పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామమే అయినా.. భీమదేవరపల్లి మండలం వంగరలో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలకు దత్తత రావడంతో ఆయన ఇంటి పేరు, ఊరు మారిపోయింది.
'జిల్లాకు ఆయన పేరు పెట్టాలి'
ఎన్నో భూ, ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కుతుందని ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కొనియాడారు. ఆయనకు కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. అందరు ప్రధాన మంత్రులను గౌరవించిన విధంగానే పీవీ నరసింహారావును కూడా గౌరవించి ఢిల్లీలో పీవీ సమాధితో కూడిన పీవీ ఘాట్ నిర్మించాలని గ్రామస్థులు కోరారు. అలాగే, రాష్ట్రంలో పీవీ జిల్లాను ప్రకటించాలని.. ఆయన పేరుపై ఓ యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మంథని ప్రజల హర్షం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం పదవిని అధిరోహించి.. అనంతరం ప్రధాని పదవిని సైతం అధిరోహించిన పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1957 నుంచి వరుసగా 4 పర్యాయాలు మంథని ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ ప్రాంత సమస్యలు పరిష్కరించేందుకు ఆయన తన వంతు కృషి చేశారని గుర్తు చేసుకుంటున్నారు. అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించేలా.. 1976లోనే మంథని నుంచి కాళేశ్వరం వెళ్లేందుకు వీలుగా స్ప్రింగ్ వంతెన నిర్మించిన ఘనత పీవీదేనని కాటారం ప్రాంత వాసులు ఆయన సేవలను కొనియాడుతున్నారు.