Megha Engineering and Infrastructure Ltd - న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) కంపెనీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎన్ఎండీసీ ఐరన్ స్టీల్ ప్లాంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన 8 అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. NISP project లో రూ. 315 కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టింది.






మేఘా ఇంజినీరింగ్‌ సంస్థకు NMDCకి సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ (NISP Ltd) 5 సంవత్సరాల పాటు ఆపరేషన్ & మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది. దాంతోపాటు నిస్ప్ ప్రాజెక్ట్ ఇంటేక్ వెల్ అండ్ పంప్ హౌస్, క్రాస్ కంట్రీ పైప్‌లైన్ పనులు మేఘాకు కేటాయించారు. అయితే తమకు ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేసుకునేందుకు మేఘా సంస్థ పెద్ద మొత్తంలో నగదు ముట్టచెప్పారని ఆరోపణలున్నాయి. U/s 120బీ ఐపీసీ r/w ఐపీసీ 465, సెక్షన్ 7 8 &9 కింద సీబీఐ కేసు నమోదు చేసింది.


ఎలక్టోరల్ బాండ్లలో రెండో స్థానంలో మేఘా ఇంజనీరింగ్


రాజకీయ పార్టీలకు అందించిన విరాళాల వివరాలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఇటీవల ఆదేశించడం తెలిసిందే. ఈ విరాళాలు జాబితాలో మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) పేరు ప్రధానంగా వినిపించింది. గేమింగ్ కంపెని తరువాత రూ.966 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసిన రెండవ సంస్థగా మేఘా సంస్థ నిలిచింది. తాజాగా రూ.315 కోట్ల అవినీతి, చీటింగ్ ఆరోపణలతో ఈ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.