Rishabh Pant Record: ఐపీఎల్ 2024 లో ఢిల్లీ వారియర్స్(DC) కెప్టెన్ రిషబ్ పంత్( Rishabh Pant) అరుదైన రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ 3వేల పరుగుల మార్క్‌ను పంత్ కేవలం 2028 బంతుల్లోనే అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో 41 పరుగులు చేసి, ఈ రికార్డును నెలకొల్పాడు. స్టోయినిస్ వేసి 12 ఓవర్లలో చివరి బంతిని బౌండరికి తరలించిన పంత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. రిషబ్ ఐపిఎల్ లో ఇప్పటివరకు 104 మ్యాచులో 34 సగటుతో 3032 పరుగులు చేశాడు.
అతని తర్వాతి స్థానంలో యూసుఫ్ పఠాన్ (2062), సూర్యకుమార్ యాదవ్ (2130), సురేశ్ రైనా (2135), మహేంద్ర సింగ్ ధోనీ (2152) ఉన్నారు. అలాగే అతి చిన్న వయసులో 3వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా పంత్ (26 ఏళ్ల 191 రోజులు) మూడో స్థానంలో నిలిచాడు. అతనికంటే ముందు శుభ్‌మన్ గిల్ (24 ఏళ్ల 215 రోజులు), విరాట్ కోహ్లీ (26 ఏళ్ల 186 రోజులు) ఈ ఫీట్‌ను సాధించారు.
పంత్ ప్రయాణం ఓ అద్భుతం
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) గత ఏడాది డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్ ఇద్దామని ఢిల్లీ నుంచి ఒంటరిగా పంత్ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్ మళ్లీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడేందుకు తీవ్రంగా శ్రమించాడు. అనుకొన్న సమయం కంటే మూడు నెలల ముందే పంత్ మైదానంలోకి అడుగుపెట్టాడు.
మ్యాచ్ విషయానికి వస్తే ..
ఐపీఎల్(IPL)లో లక్నో సూపర్ జెయింట్స్(LSH)కు ఢిల్లీ(DC) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వరుసగా మూడు విజయాలతో మంచి ఊపు మీదున్న లక్నోకు పంత్ సేన ఝులక్ ఇచ్చింది. తొలుత బంతితో లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ... తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి సాధికార విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ఇచ్చిన షాక్‌తో.. లక్నో విజయాలకు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో మెక్‌గర్క్ 55 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా అప్పటికే లక్ష్యం కరిగిపోయింది. స్టబ్స్, హోప్స్ మిగిలిన పనిని పూర్తి చేశారు.