Mallareddy Case : రెడ్డి సింహగర్జన సభలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై దాడికి జరిగిన ప్రయత్నంపై కేసులు నమదోయ్యాయి. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డి సభలోకి కొంతమంది దుండగులు ప్రవేశించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో  పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు  సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి దాడికి ప్రయత్నించారని  ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిద్దరూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులుగా భావిస్తున్నారు.  మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  



నిందితులపై సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు.  త్వ‌ర‌లోనే ఆ పదహారు మందిని  గుర్తించి, కేసులు న‌మోదు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు.  రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. సీఎం కేసీఆర్ ను ఆయన పొగుడుతూండగా సభకు  హాజరైన వారి నుంచి నిరసన వ్యక్తమయింది.  దీంతో మంత్రి తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ దాడి చేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు.


ఇక తెలంగాణ కాంగ్రెస్ చింతన - రెండు రోజుల పాటు అక్కడే !


ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన మల్లారెడ్డి తనపై దాడి చేసింది రేవంత్ రెడ్డి వర్గీయులేనని ఆరోపించారు. తన హత్యకు కుట్ర జరిగిందని ఆయన మండిపడ్డారు.  తనపై దాడి చేయటానికి రెడ్డి సభ మంచి అవకాశంగా రేవంత్ రెడ్డి భావించి పక్కా ప్లాన్ ప్రకారమే తనపై రెడ్డి సభకు గూండాలను పంపించి దాడి చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నానన్న దుగ్ధతోనే అనుచరుల ద్వారా దాడి చేయించాడని పేర్కొన్నారు.


ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. కేసులు నమోదు చేశారు కానీ. సోమశేఖర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్తామనిచెబుతున్నారు.