టాలీవుడ్‌లో ప్రఖ్యాత సినీ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వారిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. అప్పు తీర్చమని కోరినందుకు చంపేస్తామని దాసరి కుమారులు బెదిరించినట్లుగా వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా వారు దాసరి నారాయణ రావు కుమారులు దాసరి ప్రభు, అరుణ్‌‌లపై కేసు నమోదు చేశారు.


గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు అనే వ్యక్తి ఎల్లారెడ్డి గూడలో నివసిస్తున్నారు. దాసరి నారాయణరావు చనిపోకముందు ఆయనతో సోమశేఖర్ రావు సన్నిహితంగా ఉండేవారు. ఓ దశలో దాసరి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పలుమార్లు సోమశేఖర రావు వద్ద నుంచి ఆయన రూ.2.10 కోట్లను అప్పు రూపంలో తీసుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. అనంతర కాలంలో సినీ దర్శకుడు దాసరి మరణించారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్‌లు 2018 నవంబరు 13న రూ.2.10 కోట్ల అప్పునకు బదులుగా రూ.1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.


అయితే, సోమశేఖర రావు ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి నారాయణ రావు నివాసానికి వెళ్లి ప్రభు, అరుణ్‌లను డబ్బు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు ఆయనను భయపెట్టినట్లుగా బాధితుడు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభు, అరుణ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అయితే, గతంలో దాసరి చనిపోయిన తర్వాత అన్నదమ్ములైన ప్రభు, అరుణ్ మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో వారు పలుసార్లు పోలీస్ స్టేషన్‌ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అంతేకాక, దాసరి పెద్ద కుమారుడు ప్రభు అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా రెండేళ్ల క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాసరి ప్రభు.. తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2008లో కూడా ఆయన ఒకసారి ఇలాగే అదృశ్యమయ్యారు.


గతేడాది గోడ దూకిన వ్యవహారం హాట్ టాపిక్
దాసరి కుమారులు ప్రభు, అరుణ్ మధ్య ఆస్తి తగాదాలు కూడా జరిగాయి. గతేడాది జూన్‌లో చిన్న కుమారుడు అరుణ్ తన ఇంటి గోడను దూకడం హాట్ టాపిక్ అయింది. తన తమ్ముడు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి బూతులు తిట్టి దౌర్జన్యం చేశారని కూడా ప్రభు ఆ సమయంలో ఆరోపించారు. అయితే, తన తండ్రి రాసిన వీలునామా ప్రకారం.. ఆ ఇల్లు ఇద్దరికీ చెందుతుందని అలాంటప్పుడు తన ఇంటి గోడ తాను దూకితే తప్పేంటని అరుణ్ వివరణ ఇచ్చారు.