ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ రూల్స్ అతిక్రమంచి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించిన శ్రీలంక ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. శ్రీలంక వైస్​ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై ఏడాది పాటు నిషేధం విధించింది. వారు చేసిన తప్పిదానికి ఇప్పటికే జట్టు నుంచి తొలగించిన బోర్డు.. వారిని సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించడంతో పాటు కోటి రూపాయల భారీ జరిమానా విధించింది. అలాగే దేశవాళీ పోటీల్లోనూ వారు ఆరు నెలల పాటు ఆడకూడదని స్పష్టం చేసింది. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్ల కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది.


భారత్‌తో వన్డే, T20 సిరీస్‌ల కంటే ముందు శ్రీలంక... ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ల్లో 3-0తో శ్రీలంక చిత్తుగా ఓడింది.  కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలను అత్యంత కఠినమైన బయోబబుల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఆటగాళ్లంతా కఠిన ఆంక్షలను పాటించాల్సి ఉంటుంది. కానీ లంక క్రికెటర్లు డర్హామ్‌ వీధుల్లో తిరుగుతూ, సిగరెట్ కాలుస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. దాంతో బయోబబుల్‌ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వీరిని సిరీస్‌ నుంచి తప్పించి స్వదేశానికి పంపారు.


ఇంగ్లండ్​లోని ఓ మార్కెట్​లో లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా తిరుగుతూ కనిపించారు. ఈ ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వారు మాస్క్​ కూడా పెట్టుకోకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు బయోబబుల్​లో ఉండాల్సిన ఆటగాళ్లు బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ దేశ బోర్డు వారిని స్వదేశానికి రప్పించి విచారణకు ఆదేశించింది. చివరికి వారిని ఏడాది పాటు సస్పెండ్​ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. అలాగే ముగ్గురు క్రికెటర్లకు కలిపి సుమారు కోటి రూపాయల జరిమానా విధించింది. అంటే ఒక్కొక్కరిపై సుమారు 27 లక్షల రూపాయల వరకు లంక బోర్డు ఫైన్ వేసినట్లు తెలుస్తోంది.


ఈ ముగ్గురు ఆటగాళ్లు లేకుండానే భారత్‌తో సిరీస్‌లు ఆడిన శ్రీలంక వన్డే సిరీస్ 2-1తో కోల్పోయి.. టీ20 సిరీస్‌‌ను 1-2తో కైవసం చేసుకుంది. ఫలితంగా 13 ఏళ్ల తర్వాత భారత్‌పై శ్రీలంక ఓ ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఐదు వరుస టీ20 సిరీస్‌ పరాజయాల తర్వాత లంక జట్టు తొలి సిరీస్‌ విజయాన్నందుకుంది. గురువారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20‌లో స్పిన్ ఉచ్చుతో ఉక్కిరి బిక్కిరి చేసిన శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.