కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో ఏదొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కియారా అద్వానీ హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ చిత్రబృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. కియారా అద్వానీను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కియారాతో శంకర్ చర్చిస్తున్నట్లుగా కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. 



నేడు (జులై 31న) కియారా పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఈ బ్యూటీ రామ్ చరణ్ తో కలిసి 'వినయ విధేయ రామ' అనే సినిమాలో నటించింది. తెరపై వీరి జంట చూడడానికి బాగానే ఉన్నప్పటికీ సినిమా మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమా తరువాత కియారా ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా ఒప్పుకోలేదు. వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీ అయింది. గతేడాదితో ఆమె నటించిన 'గిల్టీ', 'లక్ష్మీ', 'ఇందూ కీ జవానీ' లాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 


ఈ సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వన్నప్పటికీ అమ్మడుకు బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం తగ్గలేదు. 'షేర్షా', 'భూల్ భులైయా' లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ఈ క్రమంలో శంకర్ లాంటి డైరెక్టర్ తో కలిసి పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ బ్యూటీ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో కూడా అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇప్పుడు చరణ్ తో సినిమా ఒప్పుకొని మరోసారి హాట్ టాపిక్ గా మారింది కియారా. 


ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. తమ బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ కొన్ని రోజుల్లో శంకర్ ప్రాజెక్ట్ మీదకు రానున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. నిజానికి శంకర్ తన సినిమాకి ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోకుండా పని చేస్తారు. కానీ ఈసారి నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా అందుకే శంకర్ సినిమాను ముందుగా మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ  ఏడాది చివరికి సినిమాను పూర్తి చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ చేయాలనుకుంటున్నారు. మరి అనుకున్నట్లుగా సినిమాను త్వరగా పూర్తి చేస్తారో లేదో చూడాలి.