Candidate Get Heart Attack While Writing Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థికి గుండెపోటు రాగా.. వెంటనే స్పందించిన ఎస్సై అతన్ని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు. మరో గంటలో పరీక్ష ముగుస్తుందనగా ఈ ఘటన జరిగింది. పటాన్‌చెరు (Patancheru) పీఎస్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పుల్కల్ గ్రామం లక్ష్మీనగర్‌కు చెందిన ఎల్.నగేశ్ గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం నాలుగో పేపర్ పరీక్ష రాస్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. దీంతో నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


భుజాలపై మోసుకెళ్లిన ఎస్సై..


108 వాహనం వచ్చే సమయం లేకపోవడంతో పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తోన్న ఎస్సై ఆసిఫ్ వెంటనే స్పందించారు. మూడో అంతస్తులో ఉన్న నగేశ్‌ను భుజంపై మోసుకుంటూ కిందకు తీసుకొచ్చి.. వాహనంలో ఎక్కించుకుని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. అయితే, సదరు వ్యక్తికి మూర్ఛ వ్యాధి ఉందని.. అది గుండెపోటు కాకపోవచ్చని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.


పురిటి నొప్పులతోనే..


అటు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ అభ్యర్థి పురిటినొప్పులతోనే పరీక్ష రాశారు. పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన సెంటర్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అందుకు ఆమె అంగీకరించకుండా పరీక్ష రాస్తానని చెప్పారు. కాన్పు తేదీ సైతం సోమవారమే కావడంతో పరీక్షా కేంద్రం సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సదరు అభ్యర్థి పట్టు వదలకుండా పరీక్షా రాస్తానని చెప్పడంతో.. అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో పరీక్ష కేంద్రంలో 108 అత్యవసర వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వైద్య సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. ఆమెకు ఎప్పుడు తీవ్ర నొప్పులు వచ్చినా.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం చేశారు. రేవతి భర్త, ఆమె తల్లి కూడా అందుబాటులో ఉన్నారు. కాగా, నొప్పులతోనే ఆమె పరీక్ష పూర్తి చేశారు.


Also Read: Bhuvanagiri: భువనగిరి స్కూల్ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు - మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, సిబ్బంది సస్పెండ్