LTR US Tour | డల్లాస్: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) యూకే పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ విజయగాథను అద్భుతంగా వినిపించారు. అధికారం కంటే పుట్టిన గడ్డ మీదనే తనకు మమకారం ఉంటుందని ఈ పర్యటనలో చాటారు. మే 27న యూకేలో అడుగుపెట్టిన కేటీఆర్ కు తెలంగాణ ఎన్.ఆర్.ఐలు ఘన స్వాగతం పలికారు. వారంతా కేటీఆర్ మాస్కులు ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కార్యకర్తలకు అండగా నిలిచిన కేటీఆర్
గుండె సంబంధిత ఆపరేషన్ తరువాత కోలుకుంటున్న బీఆర్ఎస్ (BRS) ఎన్నారై నాయకుడు, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ అనిల్ ఇంటికి ఏయిర్ పోర్ట్ నుంచే నేరుగా వెళ్లి కేటీఆర్ పరామర్శించారు. మలిదశ ఉద్యమంలో దశాబ్దకాలం కాలం పాటు ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ వాదాన్ని వినిపించిన అనిల్ ను ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్న సందేశాన్ని కేటీఆర్ ఇచ్చారు.
మే 28 తేదిన బీఆర్ఎస్ ఎన్నారై కార్యవర్గం, సీనియర్ నేతలతో లండన్ లో సమావేశమైన కేటీఆర్ (KTR)… పార్టీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన చర్చించారు. మలిదశ ఉద్యమకాలంలో తెలంగాణ వాదానికి ప్రతీకగా నిలిచారని ఎన్.ఆర్.ఐ (UK)విభాగాన్ని ప్రశంసించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తెలంగాణ అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారని మెచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి, మోసాలను సోషల్ మీడియాలో బలంగా ఎత్తిచూపాలన్నారు. అక్కడి ఎన్.ఆర్.ఐ నేతలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్, యూకేలో బీఆర్ఎస్ రజోత్సవ వేడుకలను నిర్వహించడానికి ఓకే చెప్పారు.
యూకే నుంచి పెట్టుబడులకు ఆహ్వానం
అదే రోజు యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి సహకారం అందించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసమే తాము పాటు పడుతామన్నారు. కోట్లాది మంది దశాబ్దాల స్వప్నాన్ని నిజం చేసిన తమకు తెలంగాణపై ఉండే ప్రేమ, అభిమానం మరెవరికీ ఉండవని చాటి చెప్పారు.
ఇక 30 న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో మెయిన్ స్పీచ్ ఇచ్చిన కేటీఆర్ ,ఆర్థిక రంగాన్ని స్థిరమైన వృద్ధితో నడిపించడంలో ప్రపంచానికి తెలంగాణ ఎలా దిక్సూచీగా మారిందో అద్భుతంగా వివరించారు. సీఎంగా కేసీఆర్ హయాంలో తమ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ రంగాల్లో అనుసరించిన విప్లవాత్మక పంథాను గణాంకాలతో సహా వివరించి, వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పాలసీలపై తన అనుభవాలును పంచుకున్నారు. సంపదను సృష్టించి దాన్ని పేదలకు సమానంగా పంచడమే తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిన విషయాన్ని కేటీఆర్ హైలెట్ చేశారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరిన కేటీఆర్, తెలంగాణను ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పీడీఎస్‌ఎల్ సంస్థ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్
మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ సంస్థలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే పీడీఎస్‌ఎల్ సంస్థ నాలెడ్జ్ సెంటర్ ను వార్విక్ యూనివర్సిటీ లో మే 31 నాడు కేటీఆర్ ప్రారంభించారు. దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీీ గర్వకారణం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో పూణే,చెన్నై తరువాత హైదరాబాద్ ఎలా ఆటోమోటివ్ హబ్ గా మారిందో వివరించారు. పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.
యూకే పర్యటన ముగించుకొని అమెరికాలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు అమెరికాలోని డల్లాస్ కి చేరుకున్నారు కేటీఆర్. 3 రోజుల యూకే పర్యటనలో అనేకమంది ఎన్నారైలు కేటీఆర్ ని కలిశారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. యూకే పర్యటన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విభాగం అద్భుతంగా పనిచేస్తుందని పార్టీ చేస్తున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.