PBKS vs MI Qualifier-2 Pitch Report: ఐపీఎల్ 2025 క్లైమాక్స్‌కు చేరింది. క్వాలిఫయర్ 1లో విజయం సాధించిన ఆర్సీబీ ఫైనల్ చేరింది. నేడు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు సీజన్ మొత్తం నిలకడగా రాణించింది. కానీ క్వాలిఫయర్ 1లో ఓటమితో డీలా పడిన పంజాబ్.. నేడు జరిగే క్వాలిఫయర్ 2లో నెగ్గి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఆదివారం నాడు క్వాలిఫయర్-2లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌, అయ్యర్ సారథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. లీగ్ ఫస్టాఫ్ లైట్ తీసుకున్న ముంబై ఇండియన్స్ సెకండాఫ్ నుంచి గేమ్ మొదలుపెట్టి వరుస జట్లకు షాకులిస్తూ క్వాలిఫయర్ 2 చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో పటిష్ట గుజరాత్‌ టైటాన్స్ ను ఓడించింది. పంజాబ్ vs ముంబై ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిదో తెలుసుకోండి. క్వాలిఫయర్-2 జరగనున్న నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ ఎలా ఉండబోతోంది. ఐపీఎల్ రికార్డు వివరాలపై ఓ లుక్కేయండి.

ఐపీఎల్ 2025లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 7 మ్యాచ్‌లలో, చాలా వరకు అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు కనిపించాయి. ఇక్కడ 200 పరుగులు చేయడం పెద్ద విషయం కాదు, అంటే, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు దీని కంటే ఎక్కువ స్కోర్ చేయకపోతే, లక్ష్యాన్ని కాపాడుకోవడం వారికి చాలా కష్టం. ముందుగా, ఈ మైదానం యొక్క ఐపీఎల్ రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ రికార్డులు

ఈ సీజన్‌లో, ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 243 పరుగులు, ఇది పంజాబ్ కింగ్స్ చేసింది. నేడు క్వాలిఫయర్-2లో అయ్యర్ జట్టుకు ఇది ప్లస్ కానుంది. 14 ఇన్నింగ్స్‌లలో 9 సార్లు 200 కంటే ఎక్కువ స్కోర్ చేసింది పంజాబ్. 2010లో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఇక్కడ జరిగింది, 2022లో గుజరాత్ టైటాన్స్ కు సొంత మైదానంగా మారింది. ఇక్కడ మొత్తం 42 IPL మ్యాచ్‌లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 21 సార్లు గెలిచింది. టాస్ గెలిచిన జట్టు 19 సార్లు గెలవగా, టాస్ ఓడిపోయిన జట్టు 23 సార్లు గెలిచింది.

జట్టు అత్యధిక స్కోరు: 243 (పంజాబ్ కింగ్స్)

అత్యధిక వ్యక్తిగత స్కోరు: 129 (శుబ్‌మాన్ గిల్)

బెస్ట్ స్పెల్: 5/10 (మోహిత్ శర్మ)

అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ 204/3 (గుజరాత్)

ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు: 176

పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ ముఖాముఖీ రికార్డులు

రెండు జట్లు మొత్తం 32 మ్యాచ్‌లలో తలపడగా ముంబై 17 సార్లు, పంజాబ్ 15 సార్లు గెలిచాయి. దాదాపు సమ ఉజ్జీలు అనే చెప్పవచ్చు. రెండు జట్లు ప్రస్తుతం ఫామ్ కొనసాగిస్తున్నాయి. ఆటగాళ్లు మంచి టచ్‌లో ఉన్నారు. మ్యాచ్ విన్నర్లతో జట్ల బలం సమానంగా ఉంది. పంజాబ్ బౌలింగ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.

నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్

పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ తలపడనున్న క్వాలిఫయర్-2లో పిచ్ బ్యాటర్లకు అనుకూలమని భావిస్తున్నారు, ఈ స్టేడియం కొంచెం బౌండరీల దూరం ఎక్కువే. కానీ బంతి ఇక్కడ బ్యాట్‌పైకి వస్తుంది. అవుట్‌ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది. ఇక్కడ గ్రౌండెడ్ షాట్‌ల ద్వారా అధికంగా స్కోరు చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే 210-220 స్కోరు చేయాల్సి ఉంటుంది. లేకపోతే దీని కంటే తక్కువ స్కోరును డిఫెండ్ చేయడం అంత ఈజీ కాదు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ స్టేడియంలో ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకు వికెట్లు లభిస్తాయి.

క్వాలిఫైయర్-2లో 11 ఆడే జట్లు

పంజాబ్ ప్లేయింగ్ 11 అంచనా: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జేమీసన్, హర్‌ప్రీత్ బ్రార్, విజయ్ కుమార్ వైశాఖ్

ముంబై ప్లేయింగ్ 11 అంచనా: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాజ్ అంగద్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్.