IPL 2025 GT VS MI Latest Updates: క్వాలిఫయర్ 2కి చేరినా తనకు ఆనందంగా లేద‌ని ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్, స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ వ్యాఖ్యానించాడు. శుక్ర‌వారం జ‌రిగిన ఎలిమినేట‌ర్ లో 20 ప‌రుగుల‌తో మాజీ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ పై ముంబై గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 81 ప‌రుగుల‌తో ముంబై విజ‌యం సాధించ‌డంలో రోహిత్ కీల‌క పాత్ర పోషించాడు. ఇక ఈ సీజ‌న్ లో 410 ప‌రుగుల‌తో ముంబై త‌ర‌పున రెండో బెస్ట్ స్కోరును న‌మోదు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచ‌రీలు ఉండ‌టం విశేషం. అయితే ఈ సీజ‌న్ లో త‌నింకా ఎక్కువ ఫిప్టీలు చేస్తే బాగుండేద‌ని వ్యాఖ్యానించాడు. అధికంగా ఫిఫ్టీలు చేసి ఉన్న‌ట్ల‌యితే త‌ను ఆనందించేవాడినని పేర్కొన్నాడు. ఇక 673 ప‌రుగుల‌తో సూర్య కుమార్ యాదవ్.. జ‌ట్టు త‌ర‌పున అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. మ‌రో 27 ప‌రుగులు సాధిస్తే, 700 ప‌రుగులు చేసిన మూడో భార‌త క్రికెట‌ర్ గా నిలుస్తాడు. గ‌తంలో ఈ ఘ‌న‌త‌ను విరాట్ కోహ్లీ, శుభ‌మాన్ గిల్ సాధించారు. 

ల‌క్ క‌లిసొచ్చింది.. ఇక ఈ మ్యాచ్ లో 81 ప‌రుగుల‌తో భారీ ఫిఫ్టీ సాధించ‌డంపై రోహిత్ సంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఇక త‌న‌కు పార్ట్న‌ర్ గా దిగిన ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ జానీ బెయిర్ స్టో పై ప్రశంస‌లు కురిపించాడు. అద్భుత ఆట‌తీరుతో బెయిర్ స్టో ఆక‌ట్టుకున్నాడ‌ని పేర్కొన్నాడు. గ‌తంలో ఇత‌ర టీమ్ ల త‌ర‌పున తాను ఆడేవాడ‌ని, ముంబై త‌ర‌పున ఇలాంటి ఆట‌తీరుతో డెబ్యూ చేయ‌డం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఇక గుజరాత్ ప్లేయర్లు తన క్యాచ్ జారవిడవంతో ఆ లక్కును ఎంజాయ్ చేశానని పేర్కొన్నాడు.  వీరిద్దరూ దూకుడుగా ఆడి, 84 ప‌రుగులు సాధించి, ముంబైకి గట్టి పునాది వేశారు. దీంతో ముంబై ఎలిమినేట‌ర్ లో 228 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. 

వారి అట‌తీరు అద్భుతం.. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్, బెయిర్ స్టో ఆరంభంలో వేగంగా ఆడి, మంచి ఆరంభాన్నిచ్చార‌ని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్ర‌శంసించాడు. వారిద్ద‌రూ ఇచ్చిన స్టార్ట్ తో ముంబై ఇండియన్స్ జట్టు కి భారీ స్కోరు వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు. ఇక జ‌స్ ప్రీత్ బుమ్రా లాంటి బౌల‌ర్ ఉండ‌టం ఏ జ‌ట్టుకైనా వ‌ర‌మ‌ని తెలిపాడు. జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో వికెట్లు తీసి, మ్యాచ్ లో ప‌ట్టు సాధించేలా చేశాడ‌ని తెలిపాడు. మ్యాచ్ ముంబై నుంచి చేజారిపోతున్న వేళ వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను క్లీన్ బౌల్ట్ చేసిన బుమ్రా.. ముంబైని గేమ్ లోకి తీసుకొచ్చాడు. ఇక గుజ‌రాత్ ఫీల్డ‌ర్లు ఈ మ్యాచ్ లో మూడు క్యాచులు జార‌విడ‌వ‌డంతో ముంబై బ్యాట‌ర్లు ఫాయిదా పొందారు. జ‌ట్టు భారీ స్కోరు సాధించేలా కీల‌క ఇన్నింగ్స్ ఆడారు.