KTR Sensational Comments On Union Budget 2024: తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు రూ.8 లు కూడా కేటాయించలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరోసారి మొండిచేయి చూపించారని.. బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించామని.. కానీ దక్కింది మాత్రం శూన్యమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కేంద్ర బడ్జెటా.? లేక బీహార్, ఏపీ బడ్జెటా.? అని చాలామంది అనుకుంటున్నట్లు చెప్పారు. 'రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీట వేశారు. తెలంగాణకు మరోసారి గుండు సున్నానే దక్కింది. ములుగు వర్శిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుకు ఎన్నిసార్లు జాతీయ హోదా అడిగినా పట్టించుకోలేదు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.






'తెలంగాణ ప్రజలు ఆలోచించాలి'


తెలంగాణ సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి అడిగినా కేంద్రం పట్టించుకోలేదని.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు 16 స్థానాలను ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. 16 స్థానాలున్న ఏపీ, 12 సీట్లున్న బీహార్‌కు కేంద్ర బడ్జెట్‌లో దక్కిన నిధులు చూసి ఆలోచించాలని.. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలి మరోసారి ఈ బడ్జెట్ తెలియజేస్తుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదని విమర్శించారు.


ఏపీకి నిధులపై..


అయితే, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించినందుకు తమకు బాధ లేదని.. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులు, వారు బాగుండాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ అన్నారు. ఏపీ విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ డిమాండ్లు మాత్రం కేంద్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 'ఏపీ విభజనం చట్టం పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. అమరావతి, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి నిధులు ఇస్తాం అన్నారు. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏపీ, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం.' అని కేటీఆర్ పేర్కొన్నారు.


ఎందుకింత నిర్లక్ష్యం.?


కేంద్ర బడ్జెట్‌లో కనీసం తెలంగాణ పదమే పలకలేదని.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏపీకి నిధులు కేటాయించడం సంతోషమేనని.. అయితే బడ్జెట్‌లో కనీసం తెలంగాణ ప్రస్తావన లేదని అన్నారు. 'తెలంగాణ ప్రజలంటే బీజేపీ, కేంద్రానికి ఎందుకింత నిర్లక్ష్యం.? పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వొచ్చు కదా.?. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో వాటా తేవాలి.' అని హరీష్ రావు డిమాండ్ చేశారు.


Also Read: Memes on Budget : బీహార్, ఏపీకే నిధులు - నిర్మలమ్మ బడ్జెట్‌పై సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్