KTR Sensational Comments On CM Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తెలంగాణ తల్లిని మూర్తీభవించిన స్త్రీగా రూపొందించారని.. ఆయనపై కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన తెలంగాణ సాహితీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చరిత్రను చెరిపేసేందుకు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్టించిన భరతమాత రూపాన్ని వాజ్‌పేయీ అధికారంలోకి రాగానే మార్చలేదని గుర్తు చేశారు. 'దేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది. తెలుగుతల్లి విగ్రహ రూపం మారలేదు. కన్నడమాత విగ్రహం రూపు మారలేదు. కానీ, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగేళ్ల తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అధికారం ఉందని సాయుధ బలగాల నడుమ మీ నాటకాలు కొంతకాలం సాగుతాయి. కానీ, ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదు.' అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
'వాటిపై సీఎంకు మాట రాదు'
సింహాలు తమ గాథ చెప్పుకోకపోతే.. వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్రగా నిలిచిపోతాయనేది అక్షర సత్యమని కేటీఆర్ అన్నారు. 'యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే తెలంగాణలో జరుగుతుంది. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం గురించి సీఎంకు ఒక్క మాట రాదు. శ్వేతసౌధం లాంటి అంబేడ్కర్ సచివాలయం గురించి ఒక్క మాట రాదు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు. ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి సీఎంకు ఒక్క మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్రను చెరిపేయాలనే మూర్ఖపు నాయకులు ఉన్నారు. ఈ సీఎం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరికానికి, సమస్యలకు చిహ్నంగా ప్రతిష్టించాలని అనుకుంటున్నారు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు.' అని కేటీఆర్ అన్నారు.
తమ పదేళ్ల పాలనలో బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా జరుపుకొన్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మన చరిత్రను ఎలుగెత్తి చాటుకునే ప్రయత్నం చేశామని.. తాము పార్టీ నాయకుల పేర్లు పెట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని అన్నారు. తెలంగాణ చరిత్ర శాశ్వతంగా నిలవాలనే ప్రయత్నంతో.. కవులు, కళాకారులకు, సాహితీవేత్తలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ఆయా ప్రాంతాల దేవుళ్ల పేర్లు పెట్టామన్నారు. కార్యక్షేత్రంలో ప్రతి రోజూ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతోన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మరో నాలుగేళ్లు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజీగా మారిందని.. హైడ్రా, మూసీ బాధితులతో పాటు పలువురు క్యూ కడుతున్నారని చెప్పారు.
Also Read: Hydra News: హైడ్రా కీలక నిర్ణయం, ఫిర్యాదులు తీసుకునేందుకు ఒకరోజు కేటాయించిన సంస్థ