KTR Comments On Janwada farmhouse Incident: తమను రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. జన్వాడ ఫామ్ హౌస్ (Janwada Farm House) ఘటనపై ఆయన ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కుట్రలతో తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని అన్నారు. మూసీ కుంభకోణం, వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కామ్‌లను బీఆర్ఎస్ బయటపెడుతోందని.. వాటికి రాజకీయంగా సమాధానం చెప్పలేకే కుట్రలకు తెర లేపారని ధ్వజమెత్తారు. 'ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక.. మా కుటుంబ సభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నారు. కుట్రలు చేసి మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. మా ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే చావుకు తెగించి వచ్చాం. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. దాదాపు 22 గంటలుగా మా బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు.' అని పేర్కొన్నారు.


దీపావళి దావత్ చేసుకుంటే తప్పా.?






తన బావమరిది రాజ్‌పాకాల ఉంటున్న సొంత ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా.? అని కేటీఆర్ ప్రశ్నించారు. 'గృహప్రవేశం సందర్భంగా బంధువులను పిలిచి దావత్ ఇచ్చారు. కొందరు రేవ్ పార్టీ అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం ఏంటో తెలుసా.?. వృద్ధులు, చిన్నపిల్లలతో సహా కుటుంబం మొత్తం బంధుమిత్రులతో కలిసి ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. పార్టీలో అసలు డ్రగ్స్ దొరకలేదు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకున్నాడో తెలియదు. చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి. ఇచ్చిన హామీలపై దృష్టి సారించండి.' అని అన్నారు.


డీజీపీకి కేసీఆర్ ఫోన్


మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. తెలంగాణ డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వెంటనే సోదాలు నిలిపేయాలని డీజీపీని కోరారు. కాగా, జన్వాడ ఫాంహౌస్‌లో పార్టీ జరుగుతుందన్న సమాచారంతో శనివారం రాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ ఫాంహౌస్ కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాలది కావడంతో సంచలనం రేకెత్తించింది. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేశారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మద్యం పార్టీ నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు.. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


అటు, ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ చేసుకున్నారని.. కర్ణాటక లిక్కర్‌తో పాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 7 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఫాంహౌస్ సూపర్‌వైజర్ కార్తీక్‌ను ఏ1గా, రాజ్‌పాకాలను ఏ2గా చేర్చినట్లు పేర్కొన్నారు.


Also Read: Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్