KCR Phone To DGP: తెలంగాణలో జన్వాడ ఫాంహౌస్ (Janwada Farm House) ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) స్పందించారు. తెలంగాణ డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వెంటనే సోదాలు నిలిపేయాలని డీజీపీని కోరారు. కాగా, జన్వాడ ఫాంహౌస్‌లో పార్టీ జరుగుతుందన్న సమాచారంతో శనివారం రాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ ఫాంహౌస్ కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాలది కావడంతో సంచలనం రేకెత్తించింది. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేశారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు.


నిర్వాహకులు 35 మందితో మద్యం పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వాళ్లకి డ్రగ్స్ టెస్ట్ చేయించగా అసలు వ్యవహారం బయటపడింది. ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. దీంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించినట్లు గుర్తించారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. Section 34, Excise Act కింద  మరో కేసు సైతం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫాంహౌస్‌లో క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కాయిన్స్ సైతం లభ్యమయ్యాయి. దీంతో క్యాసినో సైతం నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఫాంహౌస్ 30 ఎకరాల్లో విస్తరించి ఉంది.


ఓరియన్ విల్లాలో సోదాలు


అటు, రాయదుర్గం ఓరియన్ విల్లాస్ (Rayadurgam) వద్ద ఆదివారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పాకాల సోదరుడు రాజేంద్రప్రసాద్ విల్లాలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టేందుకు యత్నించగా..  విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని వారిని అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు వివేకానంద, బాల్క సుమన్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 


బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం


మరోవైపు, ఓరియన్ విలాల్లో పోలీసుల సోదాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జరిగిన ప్రదేశం వదిలేసి గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. 'కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడలో సొంతిల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారు. వారి కుటుంబ సభ్యులంతా అక్కడ కలుసుకున్నారు. పోలీసులు మాత్రం అక్కడ సీన్ మొత్తం మార్చారు. అక్కడ కేవలం 4 బాటిళ్లు మాత్రమే ఉన్నాయి. దీనికి అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది.?. డ్రగ్స్, క్యాసినో ఇవన్నీ తెరమీదకు ఎందుకు తీసుకొస్తున్నారు.?. అక్కడ పార్టీలు జరిగితే ఇక్కడ సోదాలు చేయడమేంటి.?. సెర్చ్ వారెంట్ లేకుండా బలవంతంగా ఇంట్లోకి వెళ్లడం ఏంటి.?. కచ్చితంగా దీనిపై న్యాయపోరాటం చేస్తాం.' అని పేర్కొన్నారు.


Also Read: Janwada Drugs Party: కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలి, డ్రగ్స్ కేసుతో విదేశాలకు పారిపోయే ఛాన్స్ - బండి సంజయ్ సంచలన ఆరోపణలు