KTR questions to Rahul Gandhi over Sunkishala Incident | హైదరాబాద్: సుంకిశాల ప్రమాదానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఫల్యమే కారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు. మున్సిపల్‌ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నది సీఎం రేవంత్ అని పేర్కొన్నారు. సుంకిశాల ప్రమాదంపై జ్యుడీషియల్‌ విచారణ చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ నిర్మాణ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.


సుంకిశాల ప్రమాదానికి బాధ్యులు ఎవరో ? 
కోట్లాది రూపాయల నష్టం జరిగినా, సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రమాదాన్ని చిన్నది అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ? సుంకిశాల ప్రమాదానికి బాధ్యులు ఎవరో తెలుపాలని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఇష్టరీతిన పనులు చేసిన కాంట్రాక్టర్ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. సుంకిశాల అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాలని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. 


 






‘సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగింది. ఈ విషయం ముందే తెలిస్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రస్తావించలేదు. ప్రభుత్వం తప్పు లేకుంటే ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేయగానే, సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. కానీ సుంకిశాల ప్రమాదంపై ఎందుకు ప్రస్తావించలేదు. అధికారులు చెప్పిన వినకుండా గేట్లు అమర్చడంతో ఇది జరిగింది. సుంకిశాల ప్రమాదం తమ తప్పిదమని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని’ కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్ లో ప్రశ్నించడం తెలిసిందే.


Also Read: Telangana Ration Cards: తెలంగాణలో వారికే రేషన్ కార్డులు - అర్హతలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన