KTR Comments On MSMEs: తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) రంగం అభివృద్ధిలో పరుగులు పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గత పదేళ్లలో ఎంఎస్ఎంఈల వృద్ధి రేటు 11 శాతం నుంచి 15 శాతం ఉందని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా లెక్కలతో సహా వివరించిందన్నారు. కేసీఆర్‌పై బురద చల్లాలని తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ లెక్కలు మాత్రం అబద్దాలు చెప్పవని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన అంశాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.


'అదే నిజం'


సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నది అంతే నిజమని కేటీఆర్ అన్నారు. '2018 - 2023 మధ్యలో టీఎస్ ఐపాస్ ద్వారా పెరిగిన సగటు పెట్టుబడులు 115 శాతం ఉన్నాయి. జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటాలో 10 శాతం వృద్ధి చెందింది. ఏటా ఎంఎస్ఎంఈల సంఖ్య 15 శాతం పెరిగింది. ఎంఎస్ఎంఈల కారణంగా ఉపాధి 20 శాతం పెరిగింది. ఎంఎస్ఎంఈల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలు 30 శాతం ఉద్యోగాలు పొందారు. 2020 - 2023 మధ్యలో అతి తక్కువ ఎంఎస్ఎంఈలు మూసివేయబడ్డ రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ వంటి ప్రగతిశీల విధానాలు, చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఈ అద్భుత ప్రగతి సాధ్యమైంది. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోక తప్పదు.' అని కేటీఆర్ పేర్కొన్నారు.


Also Read: CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం