KTR Chitchat With Netigens: తన 18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని.. కానీ ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ట్విట్టర్ వేదికగా 'ఆస్క్ కేటీఆర్' (#ASKKTR) పేరుతో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు ఏమాత్రం బాగా లేవని అన్నారు. 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2025 తర్వాత ఆయన విస్తృతంగా ప్రజల్లోకి వస్తారు.






కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయాం. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించాయి. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకూ వదిలిపెట్టం. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండేలా చేస్తాం. ప్రస్తుతం రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదు. పాలిటిక్స్‌లోకి వారిని ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదు.' అని పేర్కొన్నారు.


మూసీ పునరుజ్జీవం దేశంలోనే అతి పెద్ద స్కాం అని.. హైడ్రా అనేది ఓ బ్లాక్ మెయిలింగ్ టూల్ అని కేటీఆర్ ఆరోపించారు. వీటిపై నెటిజన్లు ప్రశ్నించగా సమాధానం ఇచ్చారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి వాళ్ల ఇళ్లు కూల్చుతున్నారని అన్నారు. అయితే, పెద్దవాళ్ల ఇళ్ల జోలికి వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని.. త్వరలో మహిళా, విద్యార్థి కమిటీలు వేస్తామని అన్నారు. విలువలు లేని రాజకీయాలు తాము చేయలేమని.. అవి ఎక్కువ కాలం ఉండవని పేర్కొన్నారు.






 














Also Read: Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!