Rains In Ap And Telangana: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ (Rains Alert) జారీ చేసింది. బుధవారం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలోని ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉందని తెలిపింది. చక్రవాతపు ఆవర్తనం గురువారం కూడా అదే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Continues below advertisement


గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. శుక్రవారం.. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నవంబర్ 4 వరకూ రాష్ట్రంలో వానలు కొనసాగే ఛాన్స్ ఉందని తెలిపింది.


ఏపీలోనూ వర్షాలు..


అటు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. మరోవైపు, సీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని అంచనా వేసింది. గురువారం.. అల్లూరి సీతారామరాజు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


Also Read: Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం