Extreme Tragedies In Andhrapradesh: దీపావళి పండుగ రోజున ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏలూరులో (Eluru) ఓ వ్యక్తి బాణాసంచా తీసుకెళ్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన నగరంలోని తూర్పు వీధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్ అనే వ్యక్తి బైక్‌పై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా బైక్‌పై నుంచి బస్తా కింద పడింది. ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో అగ్నిప్రమాదం
అటు, విశాఖ జైలు రోడ్డులో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో మంటలు చెలరేగగా.. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని 3 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. మంటల్లో కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, దీపావళి రోజున సెలవు కావడంతో సిబ్బంది సైతం ఎవరూ లేకపోవడం మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాతే వివరణ ఇస్తామని అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని..
ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని తల్లీకుమార్తెలు మృతి చెందిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. శిరీష అనే మహిళ తన తల్లి వజ్రమ్మను విజయవాడ ప్యాసింజర్ రైలు ఎక్కించేందుకు కావలి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. పట్టాలు దాటుతున్న క్రమంలో వజ్రమ్మ 3వ ప్లాట్‌ఫాం ఎక్కలేకపోవడంతో.. శిరీష సాయం చేయబోయింది. ఇంతలో వేగంగా వచ్చిన కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇద్దరినీ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు
మరోవైపు, గురువారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో వ్యాన్, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అటు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, ఆటో ఢీకొని డ్రైవర్ సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అటు, విశాఖ జిల్లా పద్మనాభం మండలం కురపల్లి గ్రామంలో ఓ ప్రైవేటు రిసార్టులో పుట్టినరోజు వేడుకలు విషాదం నింపాయి. స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అభిషేక్ వంశీ (24) అనే వ్యక్తి మద్యం తాగి స్విమ్మింగ్ ఫూల్‌లో దిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఎంవీపీ కాలనీగా చెందినవాడిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.