Telangana News : బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నెక్రిషాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడకు తరలించారో తెలియకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ , ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఆయనను బషీర్ బాగ్‌లోని సైబర్ క్రైమ్ ఆఫీసుకు తరలించినట్లుగా తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొన్న తర్వాత క్రిషాంక్ హైదరాబాద్ వస్తున్న సమయంలో ఆయనను చౌటుప్పల్ వద్ద పోలీసులు ఆపారు. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకుని ఆయన కారులోనే నల్లగొండ వైపు తీసుకెళ్లారు.కానీ ఎంత సేపటికి నల్లగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. ఈ అంశంపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తర్వాత నల్లగొండ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. అక్కడకూ ఆయనను తరలించలేదు.
ఈ క్రమంలో పోలీసు అదుపులో ఉన్న క్రిషాంక్ ఆచూకీ తెలియకపోవడంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులను ఆయన సంప్రదించారు. చివరికి మన్నె క్రిషాంక్ ను బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు తరలించినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు.
మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆయనపై ఆరు కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన ఉస్మానియా యూనివర్శిటీ హాస్టళ్లను మూసివేయంపైనా ఫేక్ ట్వీట్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత కారణంగా హాస్టల్ విద్యార్ధులకు సెలవులు ప్రకటించారని ఆయన ఓ ట్వీట్ చేశారు. దాంతో దుమారం రేగింది. వేసవి సెలవుల కారణంగా ఎప్పుడూ ఇచ్చే సెలవులే ఇచ్చామని ఓయూ తెలిపింది.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఓయూ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓయూ పోలీసులు మన్నె క్రిశాంక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అంశంపై కేసీఆర్ కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. తప్పుడు లెటర్లతో.. గోబెల్స్ మళ్లీ పుట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో మన్నె క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేయడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగడానికి కారణం అయింది.