Lara Dutta About ‘Ramayana’ Movie: బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘రామాయణం‘. భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందులో శ్రీ రాముడిగా బాలీవుడ్ నడుటు రణబీర్ కపూర్, సీతా దేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ప్రధాన పాత్రలకు యాక్టర్లను లాక్ చేసినప్పటికీ, మిగిలిన స్టార్ కాస్ట్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


‘రామాయణం’లో కైకేయి పాత్రపై స్పందించిన లారా దత్తా


'రామాయణం' చిత్రంలో బాలీవుడ్ నటి లారా దత్త కైకేయి పాత్రను పోషిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది. నిజానికి చాలా రోజులుగా ‘రామాయణం‘ చిత్రంలో ఆమె కైకేయిగా కనిపించబోతుంది అంటూ టాక్ నడుస్తోంది. మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే లారా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ‘రామాయణం‘ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? అని వెల్లడించింది.


“నేను కూడా చాలా రోజులుగా కొన్ని వార్తలను వింటున్నాను. ‘రామాయణం’లో కైకేయి పాత్ర పోషిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని విన్నప్పుడు నాకు కూడా సంతోషంగానే ఉంది. ఈ వార్తలను అలాగే కంటిన్యూ చేయండి. ‘రామాయణం’లో భాగం కావాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ సినిమాలో నాకు ఆఫర్ ఇస్తే, నేను పోషించే పాత్రలు చాలా ఉన్నాయి. కైకేయి మాత్రమే కాదు, శూర్పణఖ, మండోదరి లాంటి పాత్రలకు కూడా చక్కగా సరిపోతాను” అని వెల్లడించింది.  


2025 దీపావళికి ‘రామాయణం’ విడుదల


ఇక ఇప్పటికే ‘రామాయణం’ సినిమా తొలి షెడ్యూల్ కొనసాగుతోంది. ‘రామాయణం’ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్‌ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి రావణుడి తమ్ముడు విభీషణుడిగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షీబా చద్దా ఈ మూవీలో మందరగా కనిపించే అవకాశం ఉంది. ఈ చిత్రం 2025 దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఆకట్టుకున్న రణబీర్, సాయి పల్లవి లీక్ ఫోటోలు


‘రామాయణం’ సినిమా కోసం రణబీర్ కపూర్ తన మేకోర్ ను పూర్తి స్థాయిలో మార్చుకుంటున్నారు. ఫిట్ నెస్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన వర్కౌట్స్ వీడియోతో పాటు సీతా సమేత రాముడిగా రణబీర్, సాయి పల్లవి లీక్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. రణబీర్ మేకోవర్ కు సంబంధించి ఎలాంటి వీఎఫ్ఎక్స్ ఉపయోగించకూడదని దర్శకుడు భావిస్తున్నారట. అందుకే, ఆయన నేచురల్ గా ఫిట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక 'రామాయణం'లో లారా దత్తా పాత్రకు సంబంధించి త్వరలో మేకర్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.  


Read Also: నెట్‌ఫ్లిక్స్‌లో ఎంటర్టైన్మెంట్ ధూమ్ ధామ్ - మేలో అలరించే మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే!