Congress White Paper vs BRS White Paper: హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఖర్చులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు దీటుగా బీఆర్ఎస్ పార్టీ స్వేద పత్రం విడుదల చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు “ స్వేద పత్రం ” పేరుతో బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని బీఆర్ఎస్ చెబుతోంది. పగలూ రాత్రి తేడా లేకుండా.. చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని బీఆర్ఎస్ అధిష్టానం, ఎమ్మెల్యే కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖచిత్రాన్ని వివరిస్తామన్నారు. తాము చేసింది అప్పులు కాదని, అభివృద్ధి అన్నారు. స్వేద పత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను శనివారం ఆవిష్కరిస్తామని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.