Tata EV Showroom: భారతీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, సరికొత్త వాహనాల తయారీలో దూసుకెళ్తోంది. పెట్రో వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. టాటా మోటార్స్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్​ఫోలియోకు వినియోగదారులను ఓ రేంజిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టాటా సంస్థ కొత్త నిర్ణయం తీసుకుంది. కేవలం EVల కోసమే ఎక్స్​క్లూజివ్​ షోరూమ్​లను ఏర్పాటు చేస్తోంది.


గురుగ్రామ్‌లో తొలి ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్‌ ప్రారంభం


తాజాగా టాటా మోటార్స్ గురుగ్రామ్‌లో తొలి ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రెండు స్టోర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని 10 నగరాల్లో టాటా మోటార్స్​ ఈవీ ఎక్స్​క్లూజివ్​ షోరూమ్​లను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీతో పాటు ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్​ఫోలియోకు వస్తున్న డిమాండ్​ నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మారుతీ సుజుకి నెక్సా షోరూమ్​లకు దీటుగా ఈ కొత్త ఎక్స్​క్లూజివ్​ షోరూమ్​లను ఏర్పాటు చేయబోతోంది.   


ఎకో ఫ్రెండ్లీ వాతావరణంతో ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్‌ లు


ఇక టాటా EV షో రూమ్ లు ఇతర టాటా షోరూమ్‌లతో పోలిస్తే డిజైన్‌లో విభిన్నంగా ఉంటాయి. ప్రీమియం రూపాన్ని కలిగి ఉంటున్నాయి. ఈ షో రూమ్ లు ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని కలిగి ఉంటాయి. EV షో రూమ్‌ల ఏర్పాటు వల్ల తమ కంపెనీకి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని టాటా సంస్థ భావిస్తోంది. ఓవైపు పెట్రో వాహనాలతో పాటు EVలకు కూడా మంచి ఆదరణ ఆదరణ లభిస్తుందని కంపెనీ ఆలోచిస్తోంది. పెట్రో, EV వాహనాలను కలిపి ఉంచడం వల్ల ఆయా వాహనాల అమ్మకాలపై ప్రభావం పడుతున్నట్లు కంపెనీ భావించింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక షో రూమ్ లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా EV స్టోర్ లో  Nexon EV, Tiago, Tigor EVలతో సహా అన్ని టాటా EVలను అందుబాటులో ఉంచింది.






వచ్చే ఏడాది లక్ష EV యూనిట్ల అమ్మకమే లక్ష్యం


భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదే సమయంలో టాటా మోటార్స్​ ఈవీలకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్​ ఏర్పడింది. 87 శాతం వాటాతో దేశ ఈవీ సెగ్మెంట్ ​లో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది టాటా మోటార్స్​. ఈ సంస్థ నుంచి విడుదలైన కొత్త మోడళ్లకు నెల రోజుల్లో 20 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయంటే వినియోగదారులు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం అవుతోంది. అందుకే, ఈ ఆదరణను మరింత పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇక ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్స్ ఏర్పాటుతో టాటా EVలకు డిమాండ్​ మరింత పెరుగుతుందని ఆశిస్తోంది. అంతేకాదు, ఈ దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ 2024 ఆర్థిక సంవత్సరంలో కనీసం లక్ష ఈవీ యూనిట్​లను విక్రయించాలని టార్గెట్​గా పెట్టుకుంది.


Read Also: ఆటోమొబైల్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తప్పవా? - 2024 ఎలా ఉండనుంది?