Bigg Boss Winner Pallavi Prasanth Got Bail: బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prasanth)కు ఊరట లభించింది. హైదరాబాద్ (Hyderabad) నాంపల్లి కోర్టు (Nampally Court) అతనికి శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరునికి సైతం బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఆదివారం పోలీస్ విచారణకు రావాలని ఆదేశించింది. అలాగే, రూ.15 వేలతో రెండు షూరిటీలు సమర్పించాలని ప్రశాంత్ ను ఆదేశించింది. ఈ కేసులో ఏ1 నుంచి ఏ4 వరకూ అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు, మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. కాగా, బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జరిగిన ఘర్షణ ఘటనలకు సంబంధించి బాధ్యున్ని చేస్తూ పల్లవి ప్రశాంత్, అతని సోదరున్ని 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ బెయిల్ మంజూరు కావడంతో విడుదల కానున్నారు.


ఇదీ జరిగింది


బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన అనంతరం అతని అభిమానులు రెచ్చిపోయారు. అప్పుడే, బయటకు వస్తున్న అమర్ దీప్ కారుపై దాడి చేశారు. ఈ క్రమంలో అమర్, పల్లవి ప్రశాంత్ అభిమానులు పోటా పోటీ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పల్లవి ప్రశాంత్ ను ర్యాలీ చెయ్యొద్దని, పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినా, అతను వినకుండా ర్యాలీ చేశాడు. ర్యాలీ చేయకుండా పల్లవి ప్రశాంత్ ను అడ్డుకుంటున్నారంటూ అతని అభిమానులు వీరంగం సృష్టించారు. అక్కడ ఉన్న కార్లతో పాటు పోలీస్ వాహనాలు, ఆర్టీసీ బస్సులను సైతం ధ్వంసం చేశారు.


ర్యాలీ వద్దన్నా చేశాడు


గొడవ జరుగుతుందని పల్లవి ప్రశాంత్‌ను వేరే గేట్ నుంచి బయటికి పంపినా.. అతడు వినకుండా మళ్లీ అక్కడికే తిరిగి వచ్చాడని, అలా రావడంతోనే గొడవ పెద్దగా అయ్యి.. కార్లపై దాడి జరిగిందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ర్యాలీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అతడి సోదరుడు మనోహర్, ఫ్రెండ్ వినయ్.. రెండు కార్లను అద్దెకు తెచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పరిస్థితుల్లో ర్యాలీ కష్టమని, కావాలంటే తరువాతి రోజు సభ ఏర్పాటు చేసుకోమని చెప్పారు పోలీసులు. అంతే కాకుండా వాళ్లు అద్దెకు తెచ్చుకున్న కార్లను తీసుకొని వేరే వాహనాల్లో పంపించారు. పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ముందుగా వెనక్కు వెళ్లిపొమ్మంటే వెళ్లకుండా ఉన్న 2 కార్ల డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ2గా అతని సోదరుడు, ఏ3గా అతని స్నేహితుడు విజయ్ ను చేర్చారు. వారిని కోర్టులో హాజరు పరచగా, వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని పల్లవి ప్రశాంత్ కోర్టును ఆశ్రయించగా, విచారించిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


Also Read: Challans Discount: తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్ - పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్