Discount on Peding Challans in Telangana: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై (Pending Challans) భారీ రాయితీ (Challan Discount) ప్రకటించింది. టూవీలర్ పై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలానాలో 50 శాతం తగ్గింపు ఇచ్చింది. అలాగే, ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు అవకాశం కల్పించారు. చలాన్లను ఆన్ లైన్ తో పాటు మీ సేవ కేంద్రాల్లోనూ చెల్లించవచ్చు.


ప్రాసెస్ ఇలా


2022, మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గతేడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకు 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించగా, కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ.300 కోట్ల వరకూ వసూలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ పెండింగ్ ల భారం పెరిగిపోయింది. గత నెలాఖరు వరకూ పెండింగ్ చలానాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో మరోమారు ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించే వారికే ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిని సులువుగా గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్ లో ఉండగా ఈ రాయితీతో అవి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ తగ్గింపులను డిసెంబర్ 30న (శనివారం) తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో నిర్వహించే మెగా జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో ఉంచుకుని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాహనదారులు 'https://echallan.tspolice.gov.in/publicview/' వెబ్ సైట్ ద్వారా తమ వాహనాలపై ఎంత చలానా పెండింగ్ లో ఉందో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే, చలాన్లు సైతం చెల్లించవచ్చని చెప్పారు.


Also Read: Telangana News: 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు ఇచ్చి నిలబడాలా?' - ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన