Komatireddy Venkat Reddy Comments: బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకూ కేసీఆర్ కేంద్ర బడ్జెట్ పై ఏ విధంగానూ స్పందించలేదని గుర్తు చేశారు. తెలంగాణ బడ్జెట్ పై మాత్రం విమర్శలు చేశారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు దక్కకపోవడంపై అన్యాయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే ఖండించారని అన్నారు. మరి కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎందుకు నోరెత్తడం లేదని అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లోనూ బీఆర్ఎస్ సర్పంచ్ లు అందరూ పార్టీ మారారని అన్నారు.


మరోవైపు, కేంద్రంలో చంద్రబాబు, నితీశ్ కుమార్ మద్దతు ఉపసంహరించుకుంటే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే భయంతోనే ఆ రెండు రాష్ట్రాలకు ఎన్డీఏ సర్కారు అధిక కేటాయింపులు చేసిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయని కాబట్టే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కూడా కేసీఆర్ నోరు మెదపడం లేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.