BRS Supreme Court : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తప్పించాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది  ఓట‌ర్లకు అన్నీ తెలుస‌ని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలినట్టయ్యింది. సుప్రీం నిర్ణయంతో బీఆర్ఎస్ అధిష్టానం, ఆ పార్టీ అభ్యర్థులు ఆలోచనలో పడినట్లు తెలిసింది. ‘భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాసులు కాదు. ఓటర్లకు కారు, చపాతి రోలర్, రోడ్డు రోలర్ తేడా తెలియదు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.


కారును పోలిన గుర్తులతో బీఆర్ఎస్‌కు టెన్షన్ 


కారును పోలిన గుర్తులను తొలగించాలంటూ న్యాయస్థానంలో బీఆర్ఎస్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చపాతీ రోలర్, రోడ్డు రోలర్, తదితర గుర్తులను ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా ఎన్నికల సంఘానికి ఆదేశించాలంటూ బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మునుగోడు ఉప ఎన్నిక‌లో కారును పోలిన గుర్తుల‌తో నష్టపోయామని పిటిషన్‌లో పేర్కొంది. ఈ అంశంపై గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా సానుకూల తీర్పు రాలేదు. అయితే హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటి?. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా?’ అంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.


స్వతంత్ర అభ్యర్థులకు రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులు 


ఎన్నికలు వస్తున్నాయంటే చాలు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి ముందుకు వస్తారు. కొందరు టిక్కెట్లు ఆశించి కానీ, మరికొందరు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇచ్చే డబ్బుల కోసం కావచ్చు నామినేషన్లు వేయడం పరిపాటిగా మారింది. ఈవీఎంలో ఎక్కువ మంది అభ్యర్థులుంటే... పేరులో ఉన్న మొదటి అక్షరం ప్రకారం వరసగా కేటాయింపులు జరుపుతారు. గుర్తులు కూడా అలాగే కేటాయిస్తారు. అదే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. వేల సంఖ్యలో ఓట్లు వేరే గుర్తు పడుతుండటంతో కొన్ని చోట్ల ఓటమి అంచుల వరకూ వెళ్లి ఆగిపోవాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల కారు పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. 


న్యాయపోరాటం కూడా తేలిపోవడంతో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ దృష్టి                             


కోర్టుకు వెళ్లే ముందే ఈసీని కలిసి వినతపత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఎన్నికల సన్నాహాల సమీక్షకు హైదరాబాద్‌కు వచ్చిన ఎన్నికల సంఘం బృందం దృష్టికి ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. అయితే, కారు తరహా గుర్తులను వచ్చే ఎన్నికల్లో వినియోగించాలని ఈసీ నిర్ణయించడంతో  న్యాయపోరాటం చేశారు. అక్కడా ఊరట లభించకపోవడంతో ఇక  బీఆర్ఎస్ పోటీ చేసే ప్రతీ చోటా.. రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు ఉండనున్నాయి. ఇది బీఆర్ఎస్ కు ఇబ్బందికరమేనని రాజకీయవర్గాలు చెబుతున్నయి.