తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపించాలని నిర్ణయించింది. దీంతో 20 వేల బలగాలు మరో 2 రోజుల్లో తెలంగాణకు రానున్నాయి. ఇప్పటికే, రాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ నగదు స్వాధీనం చేసుకుంటున్నారు.


100 కంపెనీల నుంచి


రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘ సూచనల మేరకు, కేంద్ర హోం శాఖ 100 కంపెనీల నుంచి 20 వేల కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపించనుంది. మరో 2 రోజుల్లో ఈ బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఒక్కో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎప్, సీఆర్పీఎఫ్, ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్త్ర సీమాబల్ వంటి బలగాలకు చెందిన 60 నుంచి 80 మంది సిబ్బంది వరకూ ఉంటారు. 


సమన్వయంతో బందోబస్తు


కేంద్ర బలగాలు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పోలీసులను సమన్వయం చేసుకుని బందోబస్తు నిర్వహించనున్నాయి. కీలక ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాల ఏర్పాటు సహా సరిహద్దుల్లోనూ తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసుకోనున్నాయి. ప్రధానంగా సమస్యాత్మక కేంద్రాల్లో ఈ బృందాలు దశల వారీగా కవాతు నిర్వహించనున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ఈ బృందాలు చర్యలు చేపట్టనున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఫ్లాగ్ మార్చ్ ల ద్వారా భరోసా కల్పించనున్నాయి. 


పోలింగ్ సమయమే కీలకం


సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎంపిక చేసిన కొన్నింటి వద్ద ఈ బలగాలు సొంతంగానే విధులు నిర్వహించనున్నాయి. మరికొన్ని కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో కలిసి బందోబస్తు నిర్వహిస్తారు. పోలింగ్ ముందు రోజే సమస్యాత్మక కేంద్రాలను తమ ఆధీనంలోకి ఈ బలగాలు తీసుకుంటాయి. అలాగే, ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాలు సైతం వీరి ఆధీనంలోనే ఉండనున్నాయి. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడం, పోలింగ్ అనంతరం తిరిగి వాటిని స్ట్రాంగ్ రూంలకు తరలించే ప్రక్రియ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరగనుంది. బందోబస్తు విధులతో సహా డబ్బు, మద్యం వంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీల్లోనూ ఈ బలగాలు నిమగ్నం కానున్నాయి.


భారీగా నగదు స్వాధీనం


మరోవైపు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.243 కోట్లకు పైగా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో మొత్తంగా రూ.103 కోట్ల విలువైన నగదు సీజ్ చేయగా, ఈసారి కేవలం 10 రోజుల్లోనే అంతకు రెట్టింపు సొమ్ము పట్టుకోవడం గమనార్హం. గురువారం ఒక్క రోజే తనిఖీల్లో రూ.78.03 కోట్ల సొత్తు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో రూ.120.40 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు పట్టుబడ్డాయి. గత 24 గంటల్లో 83 కిలోల బంగారం, 213 కిలోల వెండి, 113 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.


అయితే, పోలీసుల తనిఖీలపై సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లోనే మీ నగదును తిరిగి ఇచ్చేస్తారని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే, వీటి విలువ రూ.10 లక్షల్లోపు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. దీని కోసం ప్రతి జిల్లాలోనూ గ్రీవెన్స్ సెల్ ను ఈసీ ఏర్పాటు చేసింది. పోలీసుల తనిఖీల్లో చిక్కిన నగదు, బంగారు ఆభరణాల యజమానులు ఈ సెల్ ఛైర్మన్ ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే నగదు తిరిగి ఇచ్చేస్తారని తెలిపింది.