BJP Candidates List: తెలంగాణ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసే పనిలో పడింది. శుక్రవారం తొలి జాబితాను ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఆ అభ్యర్థుల పేర్లను శుక్రవారం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఈ రోజు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. 


అభ్యర్థుల జాబితా ఖరారుపై ఇప్పటికే బీజేపీ పలు సార్లు సమావేశాలు జరిపింది. తాజాగా గురువారం ఢిల్లీలో మరో సారి వరుసగా భేటీలు, చర్చలు జరిగాయి. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే జాబితాకు సంబంధించి బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్‌ జవదేకర్‌ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. 


ఏ ఏ స్థానాల్లో పార్టీ బలంగా ఉంది? ఆశావాహులు ఎవరు? వారి బలాబలాలపై బీజేపీ అధిష్టానంతో రాష్ట్ర నేతలు చర్చించారు. ఎన్నికల్లో గెలవాలంటే చేయాల్సిన వాటిపై చర్చకు వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో తమ పార్టీ మేనిఫెస్టో గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. 


ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే ఖరారైన ప్రణాళికను అమిత్‌ షా, నడ్డాలకు రాష్ట్ర నేతలు వివరించారు. ప్రజలు బీజేపీపై సానుకూలంగా ఉన్నారని, ప్రజలను మెప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నేతలు అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.


ఆగస్టులోనే బీఆర్ఎస్ జాబితా
అందరికంటే ముందుగా బీఆరఎస్ పార్టీ ఆగస్టు నెలలోనే జాబితా విడుదల చేసింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్‌ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించారాయన. గజ్వేల్‌, కామారెడ్డి రెండు స్థానాల నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నారు. ఏడు సిట్టింగ్‌ స్థానాలకు అభ్యర్థులను మార్చారు. నర్సాపూర్‌, నాంపల్లి, జనగామ, గోషామహల్‌ నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్‌ పెట్టారు. 


ఇటీవలే కాంగ్రెస్ తొలి జాబితా
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 55 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉదయం జాబితాను ప్రకటించారు. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ కన్ఫార్మ్ ఆయింది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణికి కూడా టికెట్ దక్కింది. ఉత్తమ్ హుజుర్‌నగర్, పద్మావతి కోదాడ నుంచి బరిలోకి దిగుతున్నారు.