Kavitha Released On Bail By Supreme Court | ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఐదు నెలలపాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసకుంటున్నాయి. బెయిల్ రావడంతో ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతారు, హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి.
జైలు అధికారులకు కోర్టు ఉత్తర్వులు అందడం, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయితే మంగళవారం రాత్రి 7 గంటలకు తిహార్ జైలు నుండి ఎమ్మెల్సీ విడుదల కానున్నారని తెలుస్తోంది. అయితే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈరోజు ఢిల్లీలోనే ఉండనున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తెలంగాణ భవన్ కు లేక, నగరంలోని కేసీఆర్ నివాసానికి కవిత, కేటీఆర్, హరీష్ రావు చేరుకోనున్నారని సమాచారం.
కవిత తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ
కవితకు కొన్ని రోజుల కిందటే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ అప్పుడు నిరాశే ఎదురైంది. తాజాగా మరోసారి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈడీ తరఫున ఏఎస్‌జీ, కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆమె విచారణ పూర్తయిందని, అన్ని వివరాలు విచారణలో చెప్పారని బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. మరోవైపు మహిళ అని, ఎన్నో నెలల నుంచి జైలులో విచారణ ఖైదీగా ఉన్నారని అది కూడా పరిగణనలోకి తీసుకోవాలని వాదనలు వినిపించారు. 493 మంది సాక్షులను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయి. కేసు దర్యాప్తు పూర్తైందని, ఆమె సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ లేదన్నారు. వందల కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి కానీ, ఎలాంటి నగదు రికవరీ చేయలేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో కవితకు బెయిల్ ఇస్తున్నట్లు బెంచ్ పేర్కొంది. ఇదివరకే సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేయగా, మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసందని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. దాంతో కవిత జైలు ఇంకా ఉండాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. మహిళ అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు బెంచ్ తెలిపింది. మరోవైపు కవిత రాక కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.
Also Read: Kavitha Bail News: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట- బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు