Telangana News: తెలంగాణ రాష్ట్ర రాజముద్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ దీనంతటికీ కారణమైంది. అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై సందేహాలు నివృత్తి కోసం ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై తెలంగాణ రాజముద్ర కాకుండా ఈ మధ్య కాలంలో వైరల్ అయిన ముద్రను ప్రింట్ చేశారు. 


కొద్ది సేపటికే వివాదం.
ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కొద్ది సేపటికే వివాదం, విమర్శలు వెలువడటంతో ఫ్లెక్సీ తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కొత్త రాజముద్రాలను అధికారికంగా ప్రకటించక ముందే అధికారులు కొత్త రాజముద్రతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కంటే అధికారుల అత్యుత్సాహం ఎక్కువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరును విమర్శించారు. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ తోరణం, చార్మినార్‌ను లేకుండా చేయడం వెకిలి చేష్టలుగా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ రూపొందించిన ముద్ర ఆమోదం పొందాక ముందే అధికారులు ఎందుకు ముద్రించారని కారకులెవరో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 






ముదిరిన వివాదం.
వివాదం ముదరడంతో కార్పొరేషన్ అధికారులు తప్పు సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాజముద్రతో మరో హెల్ప్ డెస్క్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కనీసం తెలంగాణ రాజముద్ర ఏది అనేది కూడా తెలియకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎలా పని చేస్తున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటి వరకు కార్పొరేషన్ అధికారులు ఈ వివాదంపై నోరు విప్పలేదు. సంబంధిత అధికారి లీవులో ఉన్నారని చెబుతున్నారు.